కొండంత చరిత్ర గల కొబ్బరి కాయ

కొండంత చరిత్ర గల కొబ్బరి కాయ

మనదేశంలో కొబ్బరికాయను శుభప్రదంగా భావిస్తారు. పెళ్లి, పూజ, పేరంటం, హోమం, యజ్ఞం, గృహ ప్రవేశం వంటి శుభకార్యాల్లో కొబ్బరికాయ వినియోగం తప్పనిసరి.  కొబ్బరికాయను మానవ శరీరానికి ప్రతీకగా చెబుతారు. పీచుని అహంకారానికి, లోపల ఉన్న కొబ్బరిని మనసుకి, నీటిని నిర్మలత్వానికి సంకేతంగా పరిగణిస్తారు. మనిషిలోని అహంకారాన్ని విడిచిపెట్టి, నిర్మలంగా తనని తాను భగవంతునికి సమర్పించుకుంటున్నాననే భావన కలగడం కోసమే కొబ్బరికాయను కొడతారు. కొబ్బరికాయకు ఉండే మూడు కళ్ళని సూక్ష్మ, స్థూల, కారణ శరీరానికి ప్రతీకగా చెబుతారు.  ఆరోగ్య, ఔషధ, సౌందర్య ప్రయోజనాలను అందించే వనరుగా కొబ్బరికాయను చూస్తారు. కేరళ సహా పలు దక్షిణాది రాష్ట్రాల్లోనైతే నిత్యం వండుకునే వంటల్లోనూ కొబ్బరికాయను విరివిగా వినియోగిస్తారు. ఈ కొబ్బరి ఎక్కడ పుట్టిందో ఏమో కానీ ప్రపంచం మొత్తం విస్తరించింది. అలాంటి కొబ్బరికాయకూ ఓ స్పెషల్ డే ఉంది. సెప్టెంబర్ 2 న ‘ప్రపంచ కొబ్బరి దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనమిది. 

కొబ్బరి ఉత్పత్తుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఏటా ‘ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని’ నిర్వహిస్తుంటారు. కొబ్బరి ఉత్పత్తులను మరింత పెంచి, వాటి ప్రాధాన్యాన్ని ప్రజలకు విస్తృతంగా తెలపడం కోసం ఇండోనేషియా రాజధాని జకార్తాలో ‘ది ఏషియా- పసిఫిక్‌ కోకోనట్‌ కమ్యూనిటీ (ఏపీసీసీ) అనే అంతర్జాతీయ సంస్థ 1969 సంవత్సరం సెప్టెంబరు 2న ఏర్పాటైంది. ఆ రోజున ఆసియా, పసిఫిక్‌ దేశాల ప్రతినిధులు సమావేశమై ప్రపంచవ్యాప్తంగా కొబ్బరి పరిశ్రమల ఏర్పాటుతో పాటు వాటి అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన అనేక తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాలకు గుర్తుగానే సెప్టెంబరు 2వ తేదీని అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవంగా ప్రకటించారు. ఈ డేను నిర్వహించుకునే ట్రెండ్ మాత్రం 2009 సంవత్సరం నుంచే బాగా ప్రచారంలోకి వచ్చింది. 

 

దేశంలో కొబ్బరికి కేరాఫ్ కేరళ రాష్ట్రం.. తెలుగు రాష్ట్రాల్లో  కొకోనట్ కు ప్రసిద్ధి కోనసీమ ప్రాంతం. కొబ్బరి వల్లనే కోనసీమకు అంతటి పేరొచ్చింది. సముద్రం నుంచి కొట్టుకొచ్చిన కొబ్బరికాయల ద్వారా కొనసీమలో కొబ్బరి సాగు మొదలైందని చెబుతుంటారు. కొనసీమ ప్రజలకు కొబ్బరి కేవలం పంట మాత్రమే కాదు.. ఓ ఎమోషన్ కూడా!! కొబ్బరి చెట్టును కోనసీమ వాసులు కల్పతరువుగా పూజిస్తారు. ఏపీలో కొబ్బరి సాగు దాదాపు 1.22 లక్షల హెక్టార్లలో జరుగుతోంది.  దేశంలో కొబ్బరి సాగులో ఏపీ నాలుగో స్థానంలో ఉండగా, కొబ్బరికాయల ఉత్పాదకతలో మాత్రం నంబర్ 1 ప్లేస్ లో కొనసాగుతోంది. 

కొబ్బరితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ‌పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయి. ‌కొబ్బరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఎముకల ఆరోగ్యం కూడా బెటర్ అవుతుంది. ‌కొబ్బరి నూనె బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ‌ఒక కొబ్బరిబోండాం, ఒక సెలైన్ బాటిల్ తో సమానం. లేత కొబ్బరి బొండాల్లో 90 నుంచి 95 శాతం నీరు, 24 కేలరీల శక్తి ఉంటుంది. 100 గ్రాముల కొబ్బరి నీటి నుంచి 17.4 క్యాలరీల ఎనర్జీ లభిస్తుంది. కొబ్బరి గుజ్జు లో సెలీనియం, ఫెనోలిక్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ శరీరంలోని కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇంజ్యూరీ నుంచి కాపాడతాయి. కొబ్బరిలో ఉండే కొవ్వు పదార్ధాలు మీడియం చైన్ ట్రై గ్లిసరేడ్ల రూపంలో ఉంటాయి. ఇవి నేరుగా పేగుల్లోకి వెళ్లి శక్తిని సత్వరమే అందించగలవు. మందులకు లొంగని మూర్ఛ, అల్జీమర్స్ వంటి రోగాల ప్రత్యామ్నాయ చికిత్సకు మీడియం చైన్ ట్రై గ్లిసరైడ్లను వాడతారు. ఎండుకొబ్బరి నుంచి సేకరించిన వర్జిన్ నూనె వల్ల పొట్టలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుందని కొన్ని పరిశోధనలు తెలిపాయి.