
- ప్రతి ఏడాది జీడీపీ ట్రిలియన్ డాలర్లు పైకి
- 2050 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా..
- ఎఫ్‌డీఐలు ట్రిలియన్ డాలర్లకు: గౌతమ్ అదానీ
ముంబై: దేశ ఎకానమీ ప్రతి 12 నుంచి18 నెలల్లో ట్రిలియన్ డాలర్లు పెరుగుతుందని అదానీ గ్రూప్ బాస్ గౌతమ్ అదానీ అంచనా వేస్తున్నారు. జీడీపీ మొదటి ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి ఇండియాకు 58 ఏళ్లు పట్టిన విషయం తెలిసిందే. అదానీ మాత్రం 2050 నాటికి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎకానమీగా ఇండియా ఎదుగుతుందని భావిస్తున్నారు. 21 వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చైనా పశ్చిమ దేశాల విధానాలను ఫాలో అవుతుందని, యూరోపియన్ యూనియన్ దేశాలు కలిసి ఉంటాయని, గ్లోబల్‌గా రష్యా పాత్రను తగ్గించొచ్చనే అంచనాలన్నీ గ్లోబల్ సంక్షోభంతో పటాపంచలయ్యాయి. యూనిపోలార్ (ఒకే పెద్ద దేశం) లేదా బైపోలార్ ప్రపంచం (రెండు పెద్ద దేశాలు) ముందుకొచ్చి గ్లోబల్ పరిస్థితులను స్టెబిలైజ్ చేస్తాయనే మూఢనమ్మకాలూ చెరిగిపోయాయి’ అని గౌతమ్ అదానీ అన్నారు. ‘నా దృష్టిలో.. మల్టీపోలార్ (వివిధ దేశాలు సూపర్‌పవర్స్‌గా మారడం) విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో..సూపర్‌పవర్స్ (పెద్ద దేశాలు) ముందుకొచ్చి బాధ్యతలు తీసుకోవాలి. సంక్షోభంలో ఇతరులకు సాయం చేయాలి. తమకు లొంగని దేశాలను ఇబ్బంది పెట్టకూడదు. మానవత్వానికి పెద్ద పీట వేయాలి. సూపర్‌పవర్ కచ్చితంగా డెమోక్రసీ అయి ఉండాలి. కానీ, డెమోక్రసీలో ఒక్క విధానమే ఉంటుందని నమ్మకూడదు’ అని ఆయన పేర్కొన్నారు. పెరుగుతున్న దేశ ఎకానమీ ఈ పరిస్థితులకు సరిపోవచ్చని అన్నారు.
దేశంలో పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్ పరంగా స్ట్రక్చరల్ రీఫామ్స్ జరిగే సామర్ద్యాన్ని ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. ‘మొదటి ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరుకోవడానికి ఇండియాకు 58 ఏళ్లు పట్టింది. తర్వాతి ట్రిలియన్ డాలర్లు చేరుకోవడానికి 12 ఏళ్లు, మూడో ట్రిలియన్ డాలర్లు చేరుకోవడానికి కేవలం ఐదేళ్లు పట్టింది. ప్రభుత్వం సోషియల్, ఎకనామికల్ రీఫామ్స్ తెస్తున్న వేగాన్ని చూస్తుంటే వచ్చే పదేళ్లలో ప్రతి 12 – 18 నెలలకు ఇండియా జీడీపీ ట్రిలియన్ డాలర్లు పెరుగుతుందని అంచనావేస్తున్నా. ఫలితంగా దేశ ఎకానమీ 2050 నాటికి 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 45 ట్రిలియన్ డాలర్లకు ఎగుస్తుంది’ అని గౌతమ్ అదానీ అన్నారు. ప్రస్తుతం దేశ జీడీపీ 3.5 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, యూఎస్ జీడీపీ 23 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.2050 నాటికి ఇండియాలో సగటు ఏజ్ 38 సంవత్సరాలుగా, జనాభా 160 కోట్లుగా, పెర్ క్యాపిటల్ ఏడాదికి 16,000 డాలర్లుగా ఉంటుందని అదానీ అంచనావేశారు. ఎఫ్‌డీఐ ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, దేశం పై గ్లోబల్‌గా నమ్మకం పెరుగుతుందని అన్నారు. 2030 నాటికే మూడో అతిపెద్ద ఎకానమీగా మారుతామని చెప్పారు.