కొత్త డేంజర్‌లోకి ప్రపంచం: డబ్ల్యూహెచ్‌వో

కొత్త డేంజర్‌లోకి ప్రపంచం: డబ్ల్యూహెచ్‌వో
  • కేసులు పెరిగిపోవడంతో హెచ్చరికలు

జెనీవా: రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కొత్త ప్రమాద దశలోకి నెత్తేస్తోందని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. రెండు రోజుల్లో దాదాపు 1.50 లక్షల కేసులు నమోదు కావడం, ఇటలీలో డిసెంబర్‌‌లోనే కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. కాగా.. ఇప్పటి వరకు వ్యాధి బారిన పడి 4,54,000 మంది చనిపోయారు. ఇప్పటి వరకు రికార్డైన కేసుల్లో సగానికి పైగా రెండు అమెరికా ఖండాలు, దక్షిణాసియా, మధ్య ప్రాచ్య దేశాల్లో నమోదనైనట్లు డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రస్‌ అధనోమ్‌ అన్నారు. మహమ్మారిని అడ్డుకోవాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా దేశాల్లో విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయని, వాటిని పునరుద్ధరించే దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. కానీ వైరస్‌ వ్యాప్తి మాత్రం అంతకంతకు పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమకు తాము నియమాలను పాటించాలని, చేతులు శుభ్రం చేసుకుంటూ, మాస్కులు పెట్టుకుని , సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించాలని సూచించారు. “ ప్రపంచం కొత్త డేంజర్‌‌లో ఉంది. చాలా మంది ఇళ్లలోనే ఉండి విసిగిపోయారు. కానీ వైరస్‌ మాత్రం వ్యాప్తి చెందుతూనే ఉంది” అని టెడ్రెస్‌ అన్నారు. సైంటిస్టులు ఇంకా వైరస్‌ గురించి, దాని లక్షణాలు, వ్యాప్తి గురించి రిసెర్చ్‌ చేస్తున్నారని చెప్పారు.