
మనిషిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లే మనసు.. పాతాళానికీ లాక్కెళ్తుంది. అదేవిధంగా మనసు మహా శక్తిమంతమైంది, మరోవైపు మహా బలహీనమైంది. మనసుకు రుగ్మత వస్తే.. శరీరమూ ముడుచుకుపోతుంది. ఆలోచనలు పక్కదారి పడతాయి. వ్యక్తిత్వాన్ని మబ్బులు కమ్మేస్తాయి. కాబట్టి, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.
ఆరోగ్యం అనేది కేవలం శారీరక రుగ్మతలు లేకపోవడం మాత్రమే కాదు. అది సంపూర్ణ శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సు స్థితి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచించింది. ఈ నిర్వచనంలో మానసిక ఆరోగ్యం అనేది ఒక అవిభాజ్యమైన, అత్యంత కీలకమైన భాగం. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాలుగా, మానసిక ఆరోగ్యం తీవ్రమైన నిర్లక్ష్యానికి, అపోహలకు, సామాజిక వివక్షకు గురైంది.
ఈ చారిత్రక అసమతుల్యతను సరిదిద్దడానికి, మానసిక శ్రేయస్సు ప్రాముఖ్యతను ప్రపంచ వేదికపైకి తీసుకురావడానికి, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారి గొంతుకను వినిపించడానికి ఉద్దేశించిన ఒక ప్రపంచ ఉద్యమమే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన, ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, పౌర సమాజం, వ్యక్తులు ఏకమై మానసిక ఆరోగ్యంపై చర్చించడానికి, అవగాహన కల్పించడానికి, చర్యలు తీసుకోవడానికి ఈ దినోత్సవం ఒక శక్తిమంతమైన వేదికగా పనిచేస్తుంది.
150కు పైగా సభ్య దేశాలు
వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ అనే అంతర్జాతీయ మానసిక ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 1992 అక్టోబర్ 10న నిర్వహించారు. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా సభ్య దేశాలు ఉన్నాయి. మానసిక ఆరోగ్యం పట్ల ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం, ఈ అంశంపై ప్రపంచ ప్రజలకు అవగాహన కల్పించడం దీని ప్రాథమిక లక్ష్యం. మొదటి ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సెక్రటరీ జనరల్ రిచర్డ్ హంటర్ చొరవతో కార్యక్రమాలు జరిగాయి.
కాలక్రమేణా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ దినోత్సవంలో చురుకైన పాత్ర పోషించడం ప్రారంభించింది. మానసిక ఆరోగ్యం అనేది ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యతలలో ఒకటిగా మారడంలో ఈ దినోత్సవం కీలకపాత్ర వహించింది. ఈ సంవత్సరం ఈ దినోత్సవం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. 2025 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం థీమ్.. ‘మైండ్ మేటర్స్: డిగ్నిటీ, కేర్ అండ్ ఇంక్లూషన్ ఫర్ ఆల్’ (మనసుకు విలువ: గౌరవం, సంరక్షణ, అందరికీ సమానత్వం)
థీమ్ ద్వారా సందేశం
1. ప్రతి వ్యక్తి మానసిక ఆరోగ్యానికి గౌరవం ఇవ్వాలి.
2. మానసిక సమస్యలు ఉన్నవారిని సమాజం తిరస్కరించకుండా, వారిని అంగీకరించి, వారి భావాలను అర్థం చేసుకొని వారికి సరైన సపోర్టును ఇవ్వాలి. అవసరమైన సంరక్షణ అందించాలి.
3. మానసిక ఆరోగ్యాన్ని శారీరక ఆరోగ్యంతో సమానంగా చూడాలి.
ఐక్యరాజ్యసమితి అప్పటి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ 'మానసిక ఆరోగ్యం లేకుండా ఆరోగ్యమే లేదు.. ఎంతో నిర్లక్ష్యానికి గురవుతున్న అంశమిది' అని తెలిపారు.
గణాంకాలు.. వాస్తవాలు
గతంలో జరిగిన జాతీయ మానసిక ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 83 శాతం బాధితులకు తగిన చికిత్స అందుబాటులో లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం- అమెరికాలో ప్రతి పది లక్షల మందికి 100 మంది మానసిక వైద్య నిపుణులు, 300మంది సైకాలజిస్టులు ఉన్నారు. భారత్‌లో వారి సంఖ్య అతి స్వల్పం.
పది లక్షల మందికి ముగ్గురు మాత్రమే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మంది మానసిక రుగ్మతతో జీవిస్తున్నారు. మానసిక అస్థిరత్వం వల్ల అనేకమంది మద్యం, ధూమపానానికి అలవాటుపడి మరిన్ని కష్టాలపాలవుతున్నారు. పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తన సర్వేలో- యాంగ్జయిటీ, డిప్రెషన్, స్కిజోఫ్రెనియా లాంటి మానసిక రుగ్మతల బాధితుల్లో అత్యధికులు భారత్‌లోనే ఉన్నారన్న చేదు నిజాన్ని ఆవిష్కరించింది. వీరిలో 25 ఏళ్లలోపువారు 50 శాతం, 35వయసులోపువారు 65శాతం ఉన్నారు.
మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
సమస్య వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే, సమస్య రాకుండా నివారించడం ఉత్తమం. పాఠశాల స్థాయి నుంచే మానసిక ఆరోగ్య విద్యను పాఠ్యాంశంలో భాగం చేయాలి. పిల్లలకు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, భావోద్వేగాలను ఎలా అర్థం చేసుకోవాలి, సహాయం ఎలా కోరాలి అనే నైపుణ్యాలను నేర్పించాలి. మానసిక ఆరోగ్యం విలాసం కాదు, అది ఒక ప్రాథమిక మానవ హక్కు అని ఇది మనకు గుర్తు చేస్తుంది. మానసిక, శారీరక ఆరోగ్యం ఒకే నాణేనికి రెండు ముఖాలు అని, ఒకటి లేకుండా మరొకటి పరిపూర్ణం కాదని ఇది నొక్కి చెబుతుంది.
మన కుటుంబాలలో, స్నేహితుల మధ్య, కార్యాలయాలలో, సమాజంలో మానసిక ఆరోగ్యం గురించి భయం లేకుండా, వివక్ష లేకుండా మాట్లాడగలిగే వాతావరణాన్ని సృష్టించడం మనందరి సామూహిక బాధ్యత. కేవలం అక్టోబర్ 10న మాత్రమే కాకుండా, ప్రతిరోజూ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యవంతమైన మనస్సులతో కూడిన సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజం. ఆ దిశగా ప్రయాణించడానికి ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.
పి. అశోక్, జనరల్ సెక్రటరీ తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్