ప్రతి ఏటా మార్చి 24న ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం (వరల్డ్ టీబీ కంట్రోల్ డే) జరుపుకుంటాం. బ్యాక్టీరియా వల్ల వచ్చే క్షయ ఒక అంటువ్యాధి. క్షయవ్యాధి రావడానికి కారణమైనది మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ అనే బ్యాక్టీరియా. ఈ సూక్ష్మక్రిమిని 24 మార్చి 1882 లో జర్మనీ దేశానికి చెందిన రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త మొదటిసారి కనుగొన్నాడు. అందువల్ల ఇదే రోజున ప్రతి ఏడాది ప్రపంచ క్షయ నివారణ దినంగా జరుపుకుంటున్నాం. క్షయ క్రిమిని కనుగొన్నందుకు రాబర్ట్ కోచ్ కు 1905లో నోబెల్ పురస్కారం కూడా లభించింది. మన దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రజారోగ్య ప్రాణాంతక సమస్య క్షయ. ఇది స్త్రీ పురుషులకు ఎవరికైనా, ఏ వయసులోనైనా, శరీరంలో రక్త ప్రసరణ ఉన్న ఏ భాగానికైనా రావచ్చును.
శ్వాసకోస క్షయ
క్షయ క్రిమికి ఆక్సిజన్ అవసరం కాబట్టి సాధారణంగా ఇది ఆక్సిజన్ ఎక్కువగా లభించే ఊపిరితిత్తులకు సోకుతుంది. దీన్ని శ్వాసకోస క్షయ (పల్మనరీ టీబీ) అంటారు. ఊపిరితిత్తులకు కాకుండా ఇతర శరీర భాగాలకు సోకే క్షయను ఎక్స్ట్రా పల్మొనరీ టీబీ అంటారు. ఇతర శరీర భాగాలు అనగా ఎముకలు, శోషరస కణుపులు, ప్లూరా, కీళ్ళు, కాలేయం, క్లోమం మొదలైన అన్ని అవయవాలకు సోకుతుంది. క్షయ అనగా క్షీణించటం. ఈ వ్యాధి వల్ల శరీరం క్రమంగా క్షీణించిపోతుంది. మధుమేహ (షుగర్) వ్యాధిగ్రస్తులకు క్షయ వ్యాధి వచ్చే ప్రమాదం 2 నుంచి 8 రెట్లు ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఎయిడ్స్(హెచ్ఐవి), పోషకాహార లోపం ఉన్న వారు ఈ జబ్బు బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
టీబీ ఎలా సోకుతుంది?
క్షయవ్యాధి అత్యధిక జనసమ్మర్థం ఉన్న చోట్లలో, మురికివాడల్లో నివసించే వారిలో అధికంగా ఉంటుంది. క్షయ రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు టీబీ క్రీములు సన్నని తుంపర్ల ద్వారా గాలిలోకి వ్యాపిస్తాయి. ఈ తుంపర్లను ఆరోగ్యవంతులు పీల్చినప్పుడు వారికి క్షయ వచ్చే అవకాశం ఉంది. రెండు వారాలకు మించి ఎడతెరిపిలేని దగ్గు, సాయంత్రం పూట జ్వరం, ఆకలి, బరువు తగ్గడం, ఉమ్మిలో తెమడ (కఫం) పడటం లేదా రక్తం పడటం, అలసట లేదా నీరసం ఛాతిలో నొప్పి, శారీరక ఆరోగ్యంలో ఆకస్మిక మార్పు వీటిలో ఏవైనా లక్షణాలు కనిపించినట్లయితే క్షయగా అనుమానించవచ్చు. టీబీ సోకిందేమోనన్న అనుమానం ఉన్నవారు దగ్గరలోని డిఎంసి.(డిసిగ్నేటెడ్ మైక్రోస్కోప్ సెంటర్) పరీక్షా కేంద్రాల ద్వారా మన రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనూ తెమడ (కళ్ళె) పరీక్షలు రెండుసార్లు (ఉదయాన్నే, అప్పటికప్పుడు) పరీక్షలుచేసి వ్యాధిని నిర్ధారిస్తారు. ఒకవేళ రెండుసార్లు పరీక్షలు నెగిటివ్ అయితే ఎక్స్ రే తీస్తారు. ఈ పరీక్షలన్నీ ఉచితంగా చేస్తారు. సిబి నాట్ పరీక్ష ద్వారా రెండు గంటల్లోనే క్షయ వ్యాధి తీవ్రతను నిర్దారించవచ్చు.
డాట్స్ చికిత్సతో క్షయని మొగ్గలోనే తుంచివేయాలి
ప్రపంచలక్ష్యం 2030 కంటే ముందుగా భారత్ లో టీబీని నిర్మూలించడం, టీబీ కేసులను త్వరగా గుర్తించి, పూర్తిగా నయం చేసి వ్యాప్తిని తగ్గించడం, నిక్షయ్ పోర్టల్ ద్వారా రోగుల ట్రాకింగ్ పోషకాహారం కోసం ప్రభుత్వ సహాయం అందించడం వంటి లక్ష్యంతో ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ కార్యక్రమం పనిచేస్తుంది. కొత్తగా గుర్తించిన రోగుల చికిత్స కాలం ఆరు నెలలు (క్యాట్ 1). సరిగ్గా మందులు వాడకపోవడం వల్ల వ్యాధి ముదిరినవారికి, ఒకసారి నయమై మళ్లీ వ్యాధి తిరగ బెట్టినవారికి చికిత్స కాలం 8 నెలలు(క్యాట్2). మొండి ఎం.డి.ఆర్.టీబీ. (మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్ క్యూలోసిస్)కి రెండేళ్ల చికిత్స అవసరమవుతుంది. సాధారణంగా క్షయకు ఆరు నెలలు చికిత్స చేస్తే నయం అవుతుంది. క్షయ వ్యాధి రాకుండా నివారించడానికి పుట్టిన పిల్లలకు వెంటనే బి.సి.జి. టీకా వేయించాలి. డాట్స్ చికిత్సతో అనారోగ్య క్షయని మొగ్గలోనే తుంచివేయాలి. అప్పుడే టీబీ ఓడిపోతుంది, భారత్ గెలుస్తుంది.
- నాశబోయిన నరసింహ
ఆరోగ్య విస్తరణ అధికారి
