
- ఒరాకిల్ షేర్లు 41 శాతం అప్
- ఆయన మొత్తం సంపద రూ.34.6 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఒరాకిల్ ఫౌండర్, సీఈఓ లారీ ఎలిసన్ తొలిసారిగా ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. గత రెండేళ్లుగా ఈ స్పాట్‌లో కొనసాగిన ఎలాన్ మస్క్‌ను వెనక్కి నెట్టారు. ఒరాకిల్ రిజల్ట్స్ అంచనాలను మించడంతో కంపెనీ షేర్లు ఒక్కరోజే 41 శాతం లాభపడ్డాయి. ఆయన సంపదం ఒక్క రోజులోనే 101 బిలియన్ డాలర్లు (రూ.8.9 లక్షల కోట్లు) పెరిగింది.
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, ఎలిసన్ సంపద 393 బిలియన్ డాలర్ల (రూ.34.6 లక్షల కోట్ల) కు చేరగా, ఎలాన్ మస్క్ 385 బిలియన్ డాలర్ల (రూ.33.89 లక్షల కోట్ల) తో సెకెండ్ ప్లేస్‌కు పడిపోయారు. చరిత్రలో ఒక్క రోజులో నమోదైన అత్యధిక సంపద పెరుగుదల ఇదే. 81 ఏళ్ల ఎలిసన్ ఒరాకిల్‌లో భారీ వాటా కలిగి ఉన్నారు.
కంపెనీ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగంపై బలమైన అంచనాలు ఒరాకిల్ షేర్లను 41శాతం పెంచాయి. 1999 తర్వాత కంపెనీకి ఇదే అతిపెద్ద సింగిల్ డే లాభం. మరోవైపు, టెస్లా షేర్లు ఈ ఏడాది 13శాతం తగ్గాయి. ఇది మస్క్ సంపదపై ప్రభావం చూపింది. అయితే టెస్లా బోర్డ్ 1 ట్రిలియన్ డాలర్ల విలువైన కాంపెన్సెషన్ ప్యాకేజి ప్రతిపాదించింది. కానీ, ఈ షేర్లు అందాలంటే 10 ఏళ్లు ఆగాలి. ఎలిసన్ ఈ ఏడాది జూన్‌లో బెజోస్‌ను అధిగమించి రెండో స్థానానికి ఎగిశారు.