ప్రపంచాన్ని గెలిచిన టీనేజ్‌‌‌‌ క్రికెటర్లు

ప్రపంచాన్ని గెలిచిన టీనేజ్‌‌‌‌ క్రికెటర్లు

( వెలుగు స్పోర్ట్స్‌‌‌‌ డెస్క్‌‌‌‌): రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌‌‌‌లో ఎన్నో రికార్డులు సాధించి ఇండియా విమెన్స్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ ముఖచిత్రాన్ని మార్చిన  లెజెండ్‌‌‌‌ మిథాలీ రాజ్‌‌‌‌కు వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌  అందలేదు. మెన్స్‌‌‌‌ స్థాయిలో స్టార్‌‌‌‌డమ్‌‌‌‌ తెచ్చుకున్న స్మృతి మంధాన, హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కూడా సాధ్యం కాలేదు. కానీ, టీనేజ్‌‌‌‌ క్రికెటర్లు ప్రపంచాన్ని గెలిచారు. ఐసీసీ తొలిసారి నిర్వహించిన అండర్‌‌‌‌19 విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్ కప్‌‌‌‌ అందుకున్నారు. విమెన్స్‌‌‌‌లో  ఇండియాకు తొలిసారి వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ అందించి చరిత్ర సృష్టించారు. 2007లో ఇదే సౌతాఫ్రికా గడ్డపై ధోనీసేన చేసిన మ్యాజిక్‌‌‌‌ను  ఇప్పుడు షెఫాలీ వర్మ  కెప్టెన్సీలోని యంగ్‌‌‌‌ ఇండియా రీక్రియేట్‌‌‌‌ చేసింది. చిన్నోళ్లే అయినా.. ఆడుతున్నది తొలి వరల్డ్​కప్​ అయినా ఇండియన్స్ ఎంతో పరిణతి చూపెట్టారు. సక్సెస్‌‌‌‌ను ఆస్వాదిస్తూ.. కష్టాల్లో ఒకరికొకరు తోడుగా ముందుకెళ్లారు. టోర్నీలో ఏడు మ్యాచ్​ల్లో ఆరింటిలో తిరుగులేని విజయం సాధించారు.  సూపర్‌‌‌‌ సిక్స్‌‌‌‌ లో ఆస్ట్రేలియా చేతిలో మాత్రమే ఓడారు. ఆ పరాజయం తర్వాత అమ్మాయిలు పుంజుకున్న తీరు.. సెమీస్​లో న్యూజిలాండ్​, ఫైనల్లో ఇంగ్లండ్​ను చిత్తు చేసిన విధానం  అద్భుతం.

షెఫాలీకి బర్త్ డే గిఫ్ట్​

ఈ ఘనత వెనుక ఎంతో మంది కృషి ఉంది. అందులో కీలకమైనది కెప్టెన్​ షెఫాలీ వర్మ. ఇప్పటికే ఇంటర్నేషనల్‌‌‌‌ లెవెల్లో సత్తా చాటిన షెఫాలీ వర్మను ఈ టోర్నీకి ఆడించడం, ఆమెకు కెప్టెన్సీ ఇవ్వడం మాస్టర్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌ అయింది. తన ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌తో షెఫాలీ టీమ్‌‌‌‌ను అద్భుతంగా నడిపించింది. ఇప్పటికే స్టార్‌‌‌‌డమ్‌‌‌‌ వచ్చినా మిగతా ప్లేయర్లతో  కలిసిపోయింది. మూడేళ్లకిందట ఆస్ట్రేలియాలో సీనియర్‌‌‌‌ విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో అద్భుత పెర్ఫామెన్స్‌‌‌‌ చేసినా ఫైనల్లో ఓడిపోవడంతో హార్ట్‌‌‌‌బ్రేక్‌‌‌‌కు గురైంది. ఇప్పుడు లీడర్​గా తనను తాను నిరూపించుకుంటూ టీమ్​మేట్స్​లో స్ఫూర్తి నింపింది. 7 ఇన్నింగ్స్‌‌‌‌ల్లో 172 రన్స్‌‌‌‌ చేసి ఇండియా నుంచి సెకండ్‌‌‌‌ బెస్ట్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌గా నిలిచింది. శనివారమే 19వ పడిలోకి అడుగు పెట్టిన షెఫాలీ ‘నా బర్త్​ డే గిఫ్ట్​గా నేను వరల్డ్ కప్​ మాత్రమే కోరుకుంటున్నా’ అని చెప్పిన ఆమె అనుకున్నది సాధించింది. ఫైనల్​ తర్వాత షెఫాలీ కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తే ఈ కప్పు కోసం ఆమె ఎంతగా తపించిందో అర్థం చేసుకోవచ్చు.  

ఈ ఇద్దరూ కీలకం

ఈ టోర్నీలో బ్యాటింగ్‌‌‌‌లో శ్వేతా సెహ్రావత్‌‌‌‌,  బౌలింగ్‌‌‌‌లో 16 ఏండ్ల లెగ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ పార్శవి చోప్రా టీమ్‌‌‌‌కు వెన్నెముకగా నిలిచారు. శ్వేత 7  ఇన్నింగ్స్‌‌‌‌లో 3 ఫిఫ్టీలు సహా 297  రన్స్‌‌‌‌తో టోర్నీలో తనే హయ్యెస్ట్‌‌‌‌ స్కోరర్‌‌‌‌.  పార్శవి చోప్రా ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. 6 ఇన్నింగ్స్‌‌‌‌ల్లో 11 వికెట్లతో టోర్నీలో సెకండ్‌‌‌‌ బెస్ట్‌‌‌‌ బౌలర్‌‌‌‌గా నిలిచింది. మరో ఇద్దరు స్పిన్నర్లు మన్నత్‌‌‌‌, అర్చన నుంచి మంచి సపోర్ట్‌‌‌‌ లభించింది. ఇక,  ఫైనల్లో ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌గా నిలిచిన బెంగాల్‌‌‌‌ పేసర్‌‌‌‌ టిటాస్‌‌‌‌ సాధు తన పేస్‌‌‌‌తో ఆకట్టుకుంది. 

వాళ్ల వెనుక నూషిన్​

టీమ్‌‌‌‌ సక్సెస్‌‌‌‌లో షెఫాలీ, శ్వేత, పార్శవి, త్రిష తెరముందు కనిపిస్తున్న స్టార్లు. వీళ్ల వెనుక మరో స్టార్‌‌‌‌ ఉన్నారు. ఆమే టీమ్‌‌‌‌ హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ నూషిన్‌‌‌‌ అల్‌‌‌‌ ఖదీర్‌‌‌‌. 2005లో  ఇదే సౌతాఫ్రికాలో వన్డే వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ చేరిన ఇండియా విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌లో మెంబర్‌‌‌‌గా ఉన్న నూషిన్‌‌‌‌ ఓ అక్కలా అమ్మాయిలకు మార్గనిర్దేశం చేసింది. ప్లేయర్​గా తాను కప్పు నెగ్గలేకపోయిన చోట కోచ్‌‌‌‌గా కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో సక్సెస్‌‌‌‌ అయింది. ఇక, ఈ టోర్నీ విషయంలో బీసీసీఐ, నేషనల్​ క్రికెట్​ అకాడమీ (ఎన్‌‌‌‌సీఏ) పక్కా ప్లానింగ్‌‌‌‌తో ముందుకెళ్లాయి. టోర్నీ దాదాపు నాలుగైదు నెలల ముందే కోర్‌‌‌‌ టీమ్‌‌‌‌ను గుర్తించింది. నవంబర్‌‌‌‌లో స్వదేశంలో  న్యూజిలాండ్‌‌‌‌తో ఐదు టీ20ల సిరీస్‌‌‌‌ను ఏర్పాటు చేసింది. టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ టీమ్‌‌‌‌కు నెల ముందే టీమ్​ను సౌతాఫ్రికా పంపింది. సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌‌‌‌లో ఆడటం ఇండియన్స్‌‌‌‌కు ప్లస్‌‌‌‌ పాయింట్‌‌‌‌ అయ్యింది. ఏదేమైనా ఈ టోర్నీతో ఇండియా విమెన్స్​ టీమ్​కు ఆడే ఫ్యూచర్​ స్టార్స్​ దొరికారు. ఈ  విజయం కేవలం టీమ్​ మెంబర్స్​ దే  కాదు.. ఇండియాలో క్రికెట్​ను కెరీర్​గా ఎంచుకున్న  ప్రతీ అమ్మాయి గెలిచినట్టే. షెఫాలీసేన స్ఫూర్తితో ఇకపై మరెంతో మంది యంగ్​స్టర్స్​ బ్యాట్, బాల్​ పట్టుకొని గ్రౌండ్​లోకి రాబోతున్నారు. 

మన త్రిష ఫైనల్ టచ్‌‌‌‌

ఇండియా విక్టరీలో  తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష పాత్ర కూడా ఉంది. టాలెంటెడ్‌‌‌‌ బ్యాటింగ్ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ అయిన త్రిష  ఓ ఫిఫ్టీ సహా 116 రన్స్ చేసింది. శ్వేత, షెఫాలీ తర్వాత ఇండియా నుంచి థర్డ్‌‌‌‌ బెస్ట్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌గా నిలిచింది. బౌలింగ్​ చేసే చాన్స్​రాకపోయినా.. బ్యాట్​తో తనదైన ముద్ర వేసింది.  స్కాట్లాండ్‌‌‌‌పై 57 రన్స్‌‌‌‌ చేసిన ఆమెకు లంక, న్యూజిలాండ్‌‌‌‌పై ఎక్కువ బ్యాటింగ్‌‌‌‌ చేసే అవకాశం రాలేదు. అయితే, ఫైనల్లో వెంటవెంటనే రెండు వికెట్లు పడిన తర్వాత సౌమ్య తివారితో కలిసి అద్భుతంగా బ్యాటింగ్‌‌‌‌ చేసింది. టీమ్‌‌‌‌ను గెలిపించి ఫైనల్​ టచ్‌‌‌‌ ఇచ్చింది. తన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఫ్యామిలీ మెంబర్స్​ గర్వపడేలా చేసింది.