ఇవాళ్టి (జూన్ 4) నుంచి వరల్డ్ యోగా పోటీలు.. బరిలో 60 దేశాల నుంచి 400 మంది అథ్లెట్లు

ఇవాళ్టి (జూన్ 4) నుంచి వరల్డ్ యోగా పోటీలు.. బరిలో 60 దేశాల నుంచి 400 మంది అథ్లెట్లు

అహ్మదాబాద్: గుజరాత్‎లోని అహ్మదాబాద్‎లో గురువారం నుంచి మొదటి వరల్డ్​యోగా చాంపియన్​షిప్–2026 పోటీలు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌‌లో అమెరికా, మలేషియా, శ్రీలంక సహా 60కి పైగా దేశాల నుంచి 400 మందికి పైగా అథ్లెట్లు పోటీపడనున్నారు. యోగాను అంతర్జాతీయ క్రీడగా మారుస్తూ, ఒలింపిక్స్‌‌లో గుర్తింపు తెచ్చే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. 

కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ, గుజరాత్ ప్రభుత్వం సంయుక్తంగా దీనికి మద్దతు అందిస్తున్నాయి. ఆతిథ్య భారత్ తరఫున 122 మంది సభ్యుల బృందం బరిలోకి దిగుతోంది. 10 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు వయసు గల అథ్లెట్లను ఆరు విభాగాల్లో విభజించి ఈ పోటీలు నిర్వహించనున్నారు. పారదర్శకమైన తీర్పునకు అంతర్జాతీయ స్థాయిలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ స్కోరింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. 

60 కి పైగా దేశాల అథ్లెట్లు ఒకే వేదికపైకి రావడం యోగాసన క్రీడా చరిత్రలోనే ఒక మైలురాయి అని నిర్వాహకులు తెలిపారు. అథ్లెట్లు ఆరు విభాగాల్లో పోటీపడనున్నారు. సబ్ జూనియర్ పురుషులు, మహిళలు (10-నుంచి 14 ఏళ్లు), జూనియర్ పురుషులు, మహిళలు (14 నుంచి -18 ఏళ్లు), సీనియర్ (18-నుంచి 28 ఏళ్లు), సీనియర్ ఎ (28 నుంచి -35 ఏళ్లు), సీనియర్ బి (35 నుంచి -45 ఏళ్లు), సీనియర్ సి (45 నుంచి -55 ఏళ్లు). 

'యోగాసన భారత్' అధ్యక్షుడు ఉదిత్ శేత్ మాట్లాడుతూ.. "60 కి పైగా దేశాల భాగస్వామ్యంతో అహ్మదాబాద్‌‌లోని ' ఏకా అరేనా'లో ఈ వినూత్న ప్రపంచ యోగాసన చాంపియన్‌‌షిప్‌‌కు ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంది. యోగాను ప్రపంచవ్యాప్తం చేయడానికి ఇది ఒక అద్భుతమైన వేదిక. క్రీడా ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక ఇది" అని అన్నారు.

 'వరల్డ్ యోగాసన' ప్రధాన కార్యదర్శి డాక్టర్ జైదీప్ ఆర్య మాట్లాడుతూ.. " ప్రపంచ యోగాసన చాంపియన్‌‌షిప్ కేవలం ఒక పోటీ మాత్రమే కాదు, యోగా అంతర్జాతీయ క్రీడగా ఎదగడంలో కీలక ఘట్టం. యోగాలోని నైపుణ్యం, క్రమశిక్షణ, కళాత్మకతను ప్రదర్శించడానికి మొదటిసారిగా 60 కి పైగా దేశాల అథ్లెట్లు ఒకే వేదికపైకి వస్తున్నారు" అని పేర్కొన్నారు.