
ఆ మందు కొనాలంటే చేతిల ₹14.74 కోట్లు పట్టుకోవాల్సిందే. లేదంటే దొరకదు. మామూలు మనిషికి అందని మందది. చిన్నపిల్లలు ఎక్కువగా చనిపోతున్న జన్యు లోపాలం స్పైనల్ మస్క్యులర్ అట్రోపి (ఎస్ఎంఏ)కి మందది. దాని పేరు జోల్గెన్స్మా. ప్రపంచంలో అదే అత్యంత ఖరీదైన ఔషధం. స్విట్జర్లాండ్‌కు చెందిన నోవార్టిస్ అనే కంపెనీ ఆ మందును తయారు చేసింది. డాలర్లలో దాని ధర చెప్పాలంటే 21.25 లక్షల డాలర్లు. ఇప్పుడు ఆ మందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది.
రెండేళ్ల లోపు పిల్లలకు చికిత్స చేసేందుకు అనుమతినిచ్చింది. ఒక్కసారి ఈ మందిస్తే పిల్లలకు మళ్లీ ఎస్ఎమ్ఏ రాదని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఆ మందుకు తాము సరైన ధరనే నిర్ణయించామని సమర్థించుకుంటున్నారు. ఇప్పటికే జీన్ థెరపీతో జబ్బులు నయం చేయొచ్చని, దానికి 50 లక్షల డాలర్ల (సుమారు ₹34 కోట్లు) వరకు ఖర్చవుతుందని గత ఏడాది చెప్పుకొచ్చింది. అయితే, దానిపై పెద్ద చర్చే జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జోల్‌గెన్‌స్మాకు చాలా ఎక్కువ మొత్తాన్ని పెట్టిందని అమెరికాకు చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ క్లినికల్ అండ్ ఎకనామిక్ రీవ్యూ చెప్పింది. ఇప్పుడేమో అనుకున్న పరిధిలోనే ఉందని చెప్పింది.