రెజ్లర్ల ఆందోళన : కేంద్ర మంత్రి ఇంటికి సాక్షి మాలిక్

రెజ్లర్ల ఆందోళన : కేంద్ర మంత్రి ఇంటికి సాక్షి మాలిక్

గత కొన్ని రోజులుగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్‌ ఆహ్వానంపై రెజ్లర్లు ఆయన నివాసానికి చేరుకున్నారు. తాము నిరసనను ముగించడం లేదని, ప్రభుత్వం తమకు ఎలాంటి ప్రతిపాదన ఇస్తుందో చూద్దామని రెజ్లర్లు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ స్పందన తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిస్తామని తెలియజేశారు.

Also Read:ఎంపీ కాకముందే హెటిరో పార్థసారథి రెడ్డికి భూ సంతర్పణ

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై రెజ్లర్లు జూన్ 3న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తన నివాసంలో కలిశారు. ఇది జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే నిరసన చేస్తున్న రెజ్లర్లను ప్రభుత్వం రెండవసారి చర్చకు ఆహ్వానించింది. ఈ సందర్భంగా క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ అథ్లెట్లు చర్చకు రావాలని కోరారు. రెజ్లర్ల సమస్యలపై చర్చలకు చర్చించేందుకు ప్రభుత్వం సుముఖంగా అనురాగ్ ఠాకూర్ ట్వీట్ ద్వారా తెలియజేసారు. అందుకోసమే వారిని మరోసారి ఆహ్వానిస్తున్నట్లు ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇక జూన్ 5న సాక్షి మాలిక్, వినేష్ పోఘట్, బజరంగ్ పునియాతో సహా నిరసన తెలిపిన పలువురు రెజ్లర్లు తమ తమ విధుల్లో హాజరయ్యారు. అయినా న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ట్వీట్‌ చేసిన సాక్షి మాలిక్.. న్యాయం కోసం తమ పోరాటం నుంచి ఎవరూ వెనక్కి తగ్గలేదని, తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడం మానేయాలని వార్తా సంస్థలను కోరారు. ఇదిలా ఉండగా రెజ్లర్లు ముఖ్యంగా మూడు డిమాండ్లను చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్టు చేయడం, భారతదేశంలో రెజ్లింగ్‌ను క్లీన్ గా ఉంచడం, WFI ఎన్నికలను న్యాయంగా నిర్వహించడం.

https://twitter.com/ANI/status/1666324429113298944