మరాఠీలో మాట్లాడాలంటూ 20 గంటల పాటు రచయిత్రి నిరసన

మరాఠీలో మాట్లాడాలంటూ 20 గంటల పాటు రచయిత్రి నిరసన

ముంబై: మరాఠీ రచయిత్రి శోభా దేశ్‌‌పాండే ఓ జ్యువెలరీ షాప్‌‌ ఎదుట 20 గంటల పాటు నిరసన చేయడం హాట్ టాపిక్‌‌గా మారింది. వివరాలు.. చెవి రింగులు కొనడానికి ముంబైలోని ఓ జ్యువెలరీ షాప్‌‌కు శోభ దేశ్‌‌‌పాండే వెళ్లారు. దుకాణం యజమాని శంకర్‌‌లాల్ జైన్‌‌తో ఆమె మరాఠీలో మాట్లాడారు. తనతో కూడా మరాఠీలో మాట్లాడాలని శంకర్‌‌లాల్‌‌కు శోభ చెప్పారు. అయితే మరాఠీలో మాట్లాడటానికి తిరస్కరించిన శంకర్‌‌లాల్.. ఆమెను అక్కడి నుంచి వెళ్లిపోవాలన్నాడు. దీంతో ఆగ్రహం చెందిన శోభ షాప్ ఎదుట నిరసనకు దిగారు.

ఫుట్‌‌‌పాత్‌‌పైనే పడుకొని శోభ నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు మెడికల్ చెకప్స్ కోసం శోభను ఆస్పత్రిలో చేర్చారు. శోభ నిరసనకు రాజ్ థాక్రే ఆధ్వర్యంలోని మహారాష్ట్ర నవనిర్మాన్ సేన (ఎంఎన్‌‌ఎస్) మద్దతు తెలిపింది. మరాఠీలో మాట్లాడటానికి తిరస్కరించిన శంకర్‌‌లాల్ జైన్‌‌‌పై ఎంఎన్‌‌ఎస్ వర్కర్స్ దాడికి దిగారు. ‘రచయిత్రికి మద్దతు తెలిపేందుకే మేం ఇక్కడికి వచ్చాం. అహంకారంగా వ్యవహరించిన జ్యువెల్లర్ షాప్ ఓనర్‌‌కు మేం బుద్ధి చెప్పాం. మరాఠీ నేర్చుకునేంత వరకు ఆయన షాప్ మూసేసి ఉంటుంది’ అని ఎంఎన్‌‌ఎస్ లీడర్ సందీప్ దేశ్‌‌పాండే పేర్కొన్నారు.