రాత్రి సమయంలో కూడా కాంటా వేయండి : యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు

రాత్రి సమయంలో కూడా కాంటా వేయండి : యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు

యాదగిరిగుట్ట, వెలుగు: ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన వడ్లకు సరిపడా మాయిశ్చర్ (తేమ శాతం) వస్తే.. రాత్రి సమయంలో  వడ్ల కాంటా వేయాలని నిర్వాహకులకు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. తుర్కపల్లి మండలం పెద్దతండా, ముల్కలపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఏసీఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 రైతులతో స్వయంగా మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా.? అని తెలుసుకున్నారు. కేంద్రాలకు ఇప్పటివరకు ఎంత ధాన్యం వచ్చింది.? ఎంత కొనుగోలు చేశారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వడ్ల కుప్పల్లో తేమ శాతం చెక్ చేయాలని, సాయంత్రం వేళల్లో గనుక మాయిశ్చర్ వస్తే ఎంత రాత్రైనా కాంటా వేసి వడ్లను మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. 

రోజుకు రెండు, మూడు లారీలు కొనుగోలు కేంద్రాలకు పంపించాలని, లారీల కొరత ఏర్పడితే మాత్రం సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ములక్కలపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు. ఎన్ని ఇండ్లు సాంక్షన్ అయ్యాయి.? ఎన్ని నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి.? అవి ఏఏ దశలో ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు ఇండ్ల పనులను త్వరితగతిన పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేసుకోవాలని  సూచించారు.