- యాదాద్రి కలెక్టరేట్‌లో ఉద్యోగవాణి
యాదాద్రి, వెలుగు: యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ప్రత్యేకంగా ప్రజావాణి, ఉద్యోగ వాణి నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తన చాంబర్‌కు వచ్చిన కలెక్టర్ హనుమంతరావు రాత్రి 8 వరకూ ప్రజలు, ఉద్యోగుల నుంచి వచ్చిన దాదాపు 200 పిటిషన్లను పరిశీలించారు. భూ సమస్యలకు సంబంధించిన పిటిషన్లను పరిశీలించి, సంబంధిత మండల తహసీల్దార్లతో మాట్లాడారు. పిటిషన్‌దారుడి పేరు, సమస్య చెబుతూ వాటికి పరిష్కారం చూపాలని ఆదేశించారు. పరిధిలోని లేని సమస్యలు, ఏ విధంగా పరిష్కారం అవుతాయో సూచించాలని చెప్పారు.
వృద్ద జంట తమ భూ సమస్య, కుమారుడి నిరాదారణ గురించి వివరించారు. బీబీనగర్‌లో కొత్తగా ఏర్పాటు చేయబోయే వైన్ షాపు కారణంగా తాము ఇబ్బంది పడతామని పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఎక్సైజ్ ఎస్పీ విష్ణుమూర్తికి ఫోన్ చేసిన ఆయన సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. కుటుంబ పోషణ కోసం కిరాణాషాపు ఏర్పాటు చేసుకోవడం కోసం బ్యాంక్‌కు వెళ్లి లోన్ అడిగితే ఇవ్వడం లేదని మహిళ జ్యోతి వివరించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్‌కు ఫోన్ చేసి ఆమెకు లోన్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వాటిని పరిష్కరించే విధంగా ఆదేశాలను జారీ చేశారు.
