విద్యార్థులతోనే దేశ భవిష్యత్​ : హనుమంతు జెండగే

విద్యార్థులతోనే దేశ భవిష్యత్​ : హనుమంతు జెండగే

యాదాద్రి, వెలుగు : విద్యార్థులతోనే దేశ భవిష్యత్​ముడిపడి ఉందని యాదాద్రి కలెక్టర్​ హనుమంతు జెండగే అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం వలిగొండ హైస్కూల్ లోని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందించి మాట్లాడారు. నులిపురుగులతో శారీరక ఎదుగుదల తగ్గడంతోపాటు రక్తహీనత ఏర్పడుతుందన్నారు. తద్వారా చదువులో వెనుకబడి భవిష్యత్​దెబ్బతింటుందన్నారు. నులిపురుగుల నివారణ కోసం ఏడాదికి రెండుమార్లు ఆల్బెండజోల్​టాబ్లెట్లు వేసుకోవాలని సూచించారు. 

వ్యక్తిగత శుభ్రతతో నులిపురుగుల నివారణ.. 

సూర్యాపేట,వెలుగు : వ్యక్తిగత శుభ్రతతో నులిపురుగులను నివారించవచ్చునని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. గురువారం బాలెంల గ్రామంలోని ప్రభుత్వ గురుకుల కళాశాలలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది నుంచి 19 ఏండ్లలోపు వారు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకుంటే కడుపులోఉన్న నట్టలు చనిపోతాయని చెప్పారు. పిల్లల్లో రక్తహీనత తగ్గి మానసిక, శారీరక ఎదుగుదల పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో బీర్వోలు రవీందర్ రెడ్డి, జీడీ భిక్షం, జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి డాక్టర్ వెంకటరమణ, కళాశాల ప్రిన్సిపాల్స్​డాక్టర్ శైలజ, శమంతకమణి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్రవంతి, డాక్టర్ మణికంఠ, అధికారులు పాల్గొన్నారు. 

నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ..

నల్గొండ అర్బన్, వెలుగు : 19 ఏండ్లలోపు పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలని స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ టి.పూర్ణచంద్ర అన్నారు. జిల్లా కేంద్రంలోని గంధంవారిగూడెంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాలలో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. అనంతరం పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రులు వేశారు.