
- ప్రభుత్వ భూములతో పాటు
- వివాదాస్పద భూముల లెక్కలు కూడా
- సర్వే నెంబర్ల వారీగా వివరాలు
- త్వరలో సీసీఎల్ఏకు రిపోర్ట్
యాదాద్రి, వెలుగు: ప్రభుత్వ, వివాదాస్పద భూములకు సంబంధించి రెవెన్యూ ఆఫీసర్లు లెక్కలు తీస్తున్నారు. 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్-22 ఏ కింద ఎంత ప్రభుత్వ భూమి ఉంది..? వివాదాలకు సంబంధించిన భూమి ఎంత..? భూ సేకరణ కింద తీసుకున్న భూమి ఎంత.? ఈ భూమి ఉందా..? లేకుంటే చేతులు మారిందా.? అని లెక్కిస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలోని దేవాదాయ, వక్ఫ్, అసైన్డ్, సీలింగ్, భూదాన్, ఎవాక్యూ ప్రాపర్టీస్ (1948లో దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లిన వారి భూములు)ను రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 22 ఏ కింద పీవోబీ (ప్రొహిబిటెడ్ ఆన్ బ్లాక్ లిస్ట్)లో సర్వే నెంబర్ల వారీగా చేరుస్తారు.
వీటితో పాటు ఏసీబీ, ఎన్‌ఫోర్ట్‌మెంట్, ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగించిన వివాదస్పద భూములు, రోడ్లు, ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములను కూడా చేరుస్తారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన 'గోల్డెన్ఫారెస్ట్' సంస్థకు సంబంధించి యాదాద్రి జిల్లాలో ఉన్న వెయ్యి ఎకరాలకు పైగా భూములను పీవోబీలో చేర్చారు. ధరణి వచ్చిన తర్వాత ఒక సర్వే నెంబర్లో కొంత భాగాన్ని ప్రభుత్వం సేకరిస్తే.. మిగిలిన బై నంబర్లలోని భూమితో పాటు ప్రభుత్వం సేకరించిన భూమికి పరిహారం చెల్లించకున్నా నిషేధిత జాబితాలో చేర్చారు. పీవోబీలో చేర్చిన భూముల అమ్మడానికి గానీ కొనడానికి కానీ అవకాశం ఉండదు. దీంతో చాలామంది ఇబ్బందులు పడ్డారు.
ధరణితో సమస్యలు
ప్రభుత్వ భూములతో పాటు పీవోబీ యాక్ట్ -22 ఏలో చేర్చిన వివాదస్పద భూముల వివరాలను తరచూ లెక్కిస్తారని రెవెన్యూ ఆఫీసర్లు చెబుతున్నారు. 2006కు ముందు ప్రభుత్వ భూములు పీవోబీలో లేక పోవడంతో యధేచ్చగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో 2006లో ప్రభుత్వ భూములను 22 ఏ కింద చేర్చారు. ఆ తర్వాత 2012, 2013లో భూముల వివరాలు పరిశీలన జరిగినట్టుగా ఆఫీసర్లు చెబుతున్నారు. 2020 అక్టోబరు 29న ధరణి అమల్లోకి వచ్చింది. అదే ఏడాది నవంబరు 2 నుంచి ధరణి ద్వారా డిజిటల్ లావాదేవీలు మొదలుకాగా 2021లో ప్రభుత్వ భూముల వివరాలను పరిశీలించారు.
రికార్డులు గాయబ్
ధరణి డిజిటలైజేషన్ సమయంలోనే ప్రభుత్వ, వివాదాస్పద భూములు దారిమళ్లాయన్న ఆరోపణలున్నాయి. నిషేధిత భూములకు సంబంధించి రికార్డులు కూడా సరిగా లేవంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిషేధిత భూములను నోటిఫై చేయడంప్రారంభించింది. ఇందులో భాగంగానే సర్వే నెంబర్ల వారీగా ఈ భూముల లెక్కలు తీస్తున్నారు. పాత పహాణీల ఆధారంగా భూములను గుర్తించేందుకు మండలాల వారీగా రెవెన్యూ అధికారులకు బాధ్యతలు అప్పగించారు.
నిషేధిత జాబితాలోని భూముల క్రయ విక్రయాలు జరిగితే అది ఏ స్థాయిలో జరిగిందో గుర్తించనున్నారు. పీవోబీ నుంచి రిలీజ్ చేసినట్టుగా భావిస్తే ఆ భూములను తిరిగి నిషేధిత జాబితాలోకి చేర్చనున్నారు. ధరణి వచ్చిన తర్వాత నిషేధిత జాబితాలో చేర్చిన భూముల లిస్ట్ కూడా తయారు చేయనున్నారు. మండలాలవారీగా సేకరించిన వివరాలను డివిజన్, జిల్లా స్థాయి అధికారులు వెరిఫై చేసిన తర్వాత పూర్తి వివరాలతో జిల్లా కలెక్టర్ తయారు చేసిన రిపోర్ట్‌ను సీసీఎల్ఏకు పంపించనున్నారు.