నీటి ఎద్దడి నివారణకు యాక్షన్ ప్లాన్ రెడీ.. యాదాద్రి జిల్లాలో తాగునీటి వేట షురూ

నీటి ఎద్దడి నివారణకు యాక్షన్ ప్లాన్ రెడీ.. యాదాద్రి జిల్లాలో తాగునీటి వేట షురూ
  • అలర్టైన అధికారులు.. సమస్యాత్మక గ్రామాలు, వార్డుల గుర్తింపు
  • డిమాండ్ 80 ఎంఎల్​డీలు.. సప్లై 54 మాత్రమే! 
  • లోటు పూడ్చేందుకు 92 ప్రైవేట్ బోర్ల అద్దె, కొత్త పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ల ఏర్పాటు
  • 15 ఆర్ధిక సంఘం నుంచి రూ. 2.50 కోట్లు

యాదాద్రి, వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లాలో వేసవి తాకిడి మొదలవడంతో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు అప్రమత్తమై యాక్షన్​ ప్లాన్​రెడీ చేశారు. మిషన్​ భగీరథ వాటర్​తో పాటు ​బోరు బావులు, బావుల నుంచి నీరు సరఫరా చేయడానికి ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకుంటున్నారు. 

88.76 ఎంఎల్​డీ అవసరం..  

యాదాద్రి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు, 17 మండలాల్లోని 427 పంచాయతీల్లో 716 హామ్లెట్లు, 2,60,559 కుటుంబాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 7,70,833 మంది ఉండగా, ప్రస్తుతం 9 లక్షల మందికి పైగా జనాభా ఉందని అంచనా వేశారు. ఈ జనాభా అవసరాలకు రోజూ 80 ఎంఎల్​డీ నీరు అవసరం. అయితే హెచ్​ఎండబ్ల్యూఎస్​, అక్కంపల్లి బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​, ఉదయ సముద్రం నుంచి 53.96 ఎంఎల్​డీ నీరు మాత్రమే అందుతోంది.  

నీటి ఎద్దడి ఏర్పకుండా చర్యలు.. 

నీటి ఎద్దడి ఏర్పడకుండా ఆఫీసర్లు యాక్షన్​ ప్లాన్​ రెడీ చేశారు. జిల్లాలోని 424  గ్రామ పంచాయతీల్లోని 716 హామ్లెట్లు, మున్సిపాలిటీల్లో రెండు వేలకు పైగా బోరు బావులు, 35 బావులు, 351 చేతి పంపులు ఉన్నాయి. యాక్షన్​ ప్లాన్​లో భాగంగా వీటిలో కొన్నింటిని ఇప్పటికే రిపేర్​ చేయించారు. గతేడాది ఎండాకాలంలో 67 ఆవాసాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. ఈసారి నీటి ఎద్దడి తీవ్రత ఏర్పడే అవకాశాలున్న 80 అవాసాలు, మున్సిపాలిటీల్లో 25 వార్డులను గుర్తించారు. ఆయా గ్రామాల్లో అవసరమైన స్థాయిలో నీటిని సరఫరా చేసే ప్రైవేట్​బోర్లను గుర్తించి 92 ​ బోర్లను రెంట్​ తీసుకున్నారు. 6 కిలోమీటర్ల మేర పైపులైన్లు కొత్తగా వేయాల్సి ఉంటుందని గుర్తించారు. ఇప్పటికే కొన్ని గ్రామాలు, పలు వార్డుల్లో ప్రైవేట్​ బోర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. 

15వ ఫైనాన్స్​ నుంచి రూ. 2.50 కోట్లు..

తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ఈసారి 15వ ఆర్ధిక సంఘం నుంచి ఫండ్స్​ కేటాయించారు. ముందస్తుగానే రూ. 2.50 కోట్లు వరకూ ఖర్చు చేయడానికి కలెక్టర్​ అనురాగ్​ జయంతి నుంచి ఆమోదం పొందారు. ఈ డబ్బుతో గ్రామాల్లో తాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోనున్నారు. 

ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం..

ఎండాకాలంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించాం. నీటి ఎద్దడి ఏర్పడే గ్రామాలను గుర్తించాం. సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్​బోర్లు కూడా రెంట్​కు తీసుకున్నాం.  - కరుణాకరన్​, డీఈ, ఆర్​డబ్ల్యూఎస్​, యాదాద్రి