- లబ్ధిదారులు 9495
 - సంఘాలు, బ్యాంకుల నుంచి1561 మందికి రూ. 19.36 కోట్లు
 - ఇండ్ల నిర్మాణానికి ముందుకు వస్తున్న లబ్ధిదారులు
 - మరింత మందికి లోన్లు ఇచ్చేందుకు రెడీ
 
యాదాద్రి, వెలుగు: చేతిలో చిల్లగవ్వ లేకున్నా ఆఫీసర్ల ముందు చూపు మహిళా సంఘాల చేయూతతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్పీడ్‌గా సాగుతోంది. ఈ కారణంగానే ఇండ్ల నిర్మాణంలో రాష్ట్ర వ్యాప్తంగా యాదాద్రి జిల్లా ముందంజలో కొనసాగుతోంది.
యాదాద్రికి 9495 ఇండ్లు
యాదాద్రి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన గ్రామాలతో సహా మొదటి విడతలో 9495 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇండ్లు మంజూరు సమయంలోనే పేదలకు రుణాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇండ్లు మంజూరు అయిన లబ్ధిదారుల్లో జిల్లా వ్యాప్తంగా 7,743 మంది ముగ్గులు పోశారు. అయితే నిర్మాణం ప్రారంభించడానికి కొందరికి డబ్బు సమకూరకపోవడంతో వెనకడుగు వేశారు. దీంతో ఇల్లు నిర్మించడానికి ఆసక్తి ఉన్నప్పటికీ వెనకడుగు వేయడాన్ని జిల్లా ఆఫీసర్లు గుర్తించారు. వారికి మహిళా సంఘాలు, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకున్నారు.
సంఘాలు, బ్యాంక్‌ల ద్వారా రుణాలు
ఇల్లు మంజూరైన లబ్ధిదారులైన మహిళలు సంఘాల్లో సభ్యులై ఉంటే చాలు రుణం పొందడానికి అర్హులుగా ఆఫీసర్లు నిర్ణయించారు. బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి, సంఘం అంతర్గత పొదుపు నుంచి రుణం అందించే విధంగా సెర్ఫ్, మెప్మా చర్యలు తీసుకుంటోంది. వీరికి గతంలో సంఘాలు, బ్యాంకుల్లో రుణాలు పొంది ఉన్నా.. రుణం తీసుకునే అవకాశం కల్పించారు. బ్యాంకు ఆఫీసర్లు, సంఘాల లీడర్లతో జిల్లాఫీసర్లు మాట్లాడి రుణం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. కొందరు సంఘాల లీడర్లు రుణం ఇవ్వడానికి వెనుకాడటంతో వారిపై ఆఫీసర్లు సీరియస్ అయ్యారు. వెంటనే రుణం ఇవ్వాలని ఆదేశించారు.
సభ్యుల అవసరం, అర్హతను బట్టి ఒక్కొక్కరికి రూ. 50 వేల నుంచి రూ. 3 లక్షల వరకూ రుణం అందిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు నిర్మించుకోవడానికి ముందుకు వస్తున్నారు. నిర్మాణం కోసం ప్రభుత్వం నాలుగు విడతలుగా విడుదల చేసే సొమ్ములోంచి తీసుకున్న రుణం చెల్లించాల్సి ఉంటుంది.
1561 మందికి.. రూ. 19.36 కోట్ల లోన్లు
మొదటి విడతలో మంజూరైన ఇండ్లలో కనీసం రెండు వేల మందికి రుణాలు ఇప్పించాలని ఆఫీసర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటివరకూ 1561 మందికి రూ. 50 వేల నుంచి రూ. 3 లక్షల వరకూ రుణాలు అందుకున్నారు. మొత్తంగా రూ. 19 కోట్లు రుణంగా అందించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇప్పటివరకూ గ్రామీణ ప్రాంతాల్లో 1408 మంది లబ్ధిదారులకు రూ. 17.70 కోట్లు రుణం అందించారు. ఆరు మున్సిపాలిటీల్లో 153 మందికి రూ. 1.66 కోట్లు రుణంగా అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో బీబీనగర్, భువనగిరి, రామన్నపేట మండలాల్లో ఎక్కువ మంది రుణాలు తీసుకున్నారు. మోత్కూరు మండలంలోనే అత్యల్పంగా కేవలం 15 మంది మాత్రమే రుణాలు తీసుకున్నారు. ఆలేరు మున్సిపాలిటీలోనే ఎక్కువ మంది తీసుకోగా యాదగిరిగుట్టలో కేవలం ఆరుగురే రుణాలు తీసుకున్నారు. రుణాలు ఎక్కువ మందికి ఇప్పించడం వల్ల ఇండ్ల నిర్మాణంలో రాష్ట్ర వ్యాప్తంగా యాదాద్రి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.
రుణం కోరిన సభ్యురాలికి కచ్చితంగా ఇవ్వాలి: ఇల్లు మంజూరైన లబ్ధిదారు సంఘం నుంచి రుణం కోరితే కచ్చితంగా ఇవ్వాలి. గతంలో రుణం తీసుకున్నారన్న సాకుతో ఆపోద్దు. లబ్ధిదారులకు రుణాలు అందించడం ద్వారా సొంతింటి కల నిజం చేసుకుంటారు. అర్హులకు ఇండ్లు నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. - ఏ భాస్కర్‌రావు, అడిషనల్ కలెక్టర్, యాదాద్రి
ఇండ్ల నిర్మాణం ఇలా
ముగ్గు పోసినవి        7743
బేస్మెంట్ లెవల్     5138
లెంటల్ లెవల్        964
స్లాబ్‌లెవల్              267
కంప్లీట్                     10
