ట్రిపుల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌పై ముందడుగు.. కోర్టు స్టే వెకేట్‌‌‌‌ కోసం పిటిషన్ వేయాలని నిర్ణయం

ట్రిపుల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌పై ముందడుగు.. కోర్టు స్టే వెకేట్‌‌‌‌ కోసం పిటిషన్ వేయాలని నిర్ణయం
  •     స్టే లేని భూమి సేకరణకు త్రీడీ నోటిఫికేషన్​ 
  •     ఎన్నికల నోటిఫికేషన్ ​రాకముందే చర్యలు
  •     కలెక్టరేట్‌‌‌‌లో జరిగిన రివ్యూలో అధికారుల నిర్ణయాలు

యాదాద్రి, వెలుగు: ప్రభుత్వ ఆదేశాలతో రీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణపై యాదాద్రి ఆఫీసర్లు అడుగు ముందుకేశారు. శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌లో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌‌‌‌లో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.  హైకోర్టు విధించిన స్టేను వెకేట్ చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిటిషన్ చేయాలని, స్టే ఉన్న భూములను వదిలి మిగితా భూసేకరణకు త్రీడీ నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ ప్రక్రియ అంతా పార్లమెంట్​ఎన్నికల నోటిఫికేషన్​ వచ్చేనాటికి పూర్తి కావాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌‌‌‌‌‌‌‌ అదేశించారు. 

59.33 కిలోమీటర్లు

యాదాద్రి జిల్లా మీదుగా 59.33 కిలోమీటర్ల మేర రీజినల్​రింగ్​ రోడ్డు నిర్మాణం జరగనుంది.  ఇందుకోసం జిల్లాలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి మున్సిపాలిటీ, వలిగొండ, చౌటుప్పల్​ మండలాల్లో 1917ఎకరాలను సేకరించాల్సి ఉంది. అయితే ట్రిపుల్ ఆర్‌‌‌‌‌‌‌‌ను యాదాద్రి జిల్లా రైతులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే  పలుమార్లు భూములు కోల్పోయామని, మళ్లీ కోల్పోవడానికి సిద్ధంగా లేమని చెబుతూ వస్తున్నారు. అభ్యంతరాలను స్వీకరించడానికి ఏర్పాటు చేసిన సమావేశాల్లో భూమిని ఇవ్వమని తేల్చి చెప్పారు. అయినప్పటికీ వారి అభ్యంతరాలను నేషనల్​హైవే అథారిటీ ఆఫీసర్లు పట్టించుకోలేదు. 
 
ఇప్పటికే కోర్టుకు వెళ్లిన ఎన్‌‌‌‌హెచ్ఏ 

భూ సేకరణను వ్యతిరేస్తూ భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి రైతులు ఆందోళనలు నిర్వహించడంతో పాటు అప్పటి మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో నలుగురు రైతులను పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించారు. ఈ పరిణామాల అనంతరం భూ సేకరణపై 29 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రైతుల తరఫున వాదనలు విన్న న్యాయస్థానం భూ స్టే విధించింది. దీంతో భూ సేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే భూ సేకరణ మొత్తంపై స్టే ఉందని రైతులు చెబుతుండగా, కోర్టుకు వెళ్లిన రైతులకు సంబంధించిన 74 ఎకరాలపైనే స్టే ఉందని ఆఫీసర్లు అంటున్నారు. ఈ స్టేను వెకేట్​చేయించేందుకు నేషనల్​హైవే అథారిటీ ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. 

త్రీడీ నోటిఫికేషన్ తర్వాత అవార్డు ప్రకటన

కలెక్టర్​ హనుమంతు జెండగే నేతృత్వంలో శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌లో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు.  ఇందులో ఇప్పటివరకు జరిగిన పరిణామాలతో పాటు స్టక్చర్​ వ్యాల్యూకు సంబంధించి పురోగతి సాధించామని అధికారులు వివరించారు. హైకోర్టు స్టేపై నేషనల్​ హైవే అథారిటీ పిటిషన్​ వేసిన అంశాన్ని ఆఫీసర్లు వెల్లడించారు.  అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..  స్టే ఉన్న 74 ఎకరాలు వదిలేసి మిగిలిన భూమిని సేకరించడంపై దృష్టి సారించాలని ఆదేశించారు. స్టే వేకెట్​కోసం కోర్టులో పిటిషన్​ వేయాలని ఆర్డీవో ఆమరేందర్‌‌‌‌‌‌‌‌కు సూచించారు.  లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్నందున ఫిబ్రవరి నాటికి  భూసేకరణ ప్రక్రియ ముగించాలని ఆదేశించారు.  దీంతో పాటు త్రీడీ నోటిఫికేషన్​ జారీ చేసేందుకు  చర్యలు తీసుకోవాలని, దీని తర్వాతే అవార్డు ప్రకటన ఉంటుందని ఆయన తెలిపారు. 

చౌటుప్పల్​లో అలైన్మెంట్​ చేంజ్​..?

జిల్లాలోని చౌటుప్పల్​లో కిలోమీటర్​ అలైన్మెంట్​ చేంజ్ చేయనున్నారని సమాచారం.  చౌటుప్పల్​ నుంచి లింగోజిగూడెం మధ్య ట్రిపుల్​ఆర్​ (156 నుంచి -157వ కిలోమీటర్​ వరకు) నిర్మాణం చేయాల్సి ఉంది. ఇందుకోసం 14.35 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది.  అయితే ఈ కిలోమీటర్​ మేర అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌ చేంజ్​ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.