సెప్టెంబర్‌‌ నాటికి యాదాద్రి ప్లాంట్ పనులు పూర్తవ్వాలె : సీఎం కేసీఆర్

సెప్టెంబర్‌‌ నాటికి యాదాద్రి ప్లాంట్  పనులు పూర్తవ్వాలె : సీఎం కేసీఆర్

హైదరాబాద్‌‌, నల్గొండ, వెలుగు: వచ్చే ఏడాది సెప్టెంబర్‌‌ నాటికి యాదాద్రి పవర్‌‌ ప్లాంట్‌‌ పనులు పూర్తి చేసి ఒకటో యూనిట్‌‌లో కరెంట్‌‌ ఉత్పత్తి ప్రారంభించాలని అధికారులను సీఎం కేసీఆర్‌‌ ఆదేశించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌‌ పవర్‌‌ ప్రాజెక్టు పనులను సోమవారం ఆయన పరిశీలించారు. మొదట హెలికాప్టర్‌‌లో ఏరియల్‌‌ వ్యూ ద్వారా పవర్‌‌ ప్లాంట్‌‌ నిర్మాణ పనులను పరిశీలించారు. తర్వాత హెలిప్యాడ్‌‌ నుంచి పవర్‌‌ ప్లాంట్‌‌ ఫేజ్‌‌ -1, యూనిట్‌‌ -2 బాయిలర్‌‌ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. 82 మీటర్ల ఎత్తులోని 12వ ఫ్లోర్‌‌కు చేరుకొని పనులు పరిశీలించారు. ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో, వర్క్‌‌ ఏజెన్సీ బీహెచ్‌‌ఈఎల్‌‌ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన డిస్‌‌ప్లే బోర్డులు పరిశీలించారు. తర్వాత మంత్రులు, అధికారులు, వర్క్‌‌ ఏజెన్సీ ప్రతినిధులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 4 వేల మెగావాట్ల కెపాసిటీతో ఈ ప్లాంట్‌‌ నిర్మిస్తోందన్నారు. ప్రైవేట్‌‌, కార్పొరేట్‌‌ శక్తులు ఒత్తిడి తెచ్చినా తలొగ్గకుండా రైతులు, ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వ రంగంలోనే ప్లాంట్‌‌ నిర్మాణం చేపట్టామని తెలిపారు.

2024 జూన్‌‌కి అన్ని యూనిట్లు

దామరచర్ల హైవే నుంచి పవర్‌‌ ప్లాంట్‌‌ వరకు 7 కి.మీ.ల ఫోర్‌‌లేన్‌‌ సీసీ రోడ్‌‌ వెంటనే మంజూరు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైల్వే క్రాసింగ్‌‌ వద్ద ఆర్వోబీతో పాటు దామరచర్ల రైల్వే స్టేషన్‌‌ విస్తరణకు రైల్వే అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పవర్‌‌ ప్లాంట్‌‌లోని రెండో యూనిట్‌‌ వచ్చే ఏడాది డిసెంబర్‌‌ కల్లా, మిగతా మూడు యూనిట్లు 2024 జూన్‌‌లోపు పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. 

సాగర్ లిఫ్ట్ పనులు త్వరగా పూర్తి చేయాలి

పవర్‌‌ ప్లాంట్‌‌కు భూమి ఇచ్చిన రైతులతో పాటు నాగార్జునసాగర్‌‌ ప్రాజెక్టుకు సంబంధించిన రైతుల పెండింగ్‌‌ సమస్యలన్నీ పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో భాగంగా ప్రకటించిన 11 లిఫ్ట్ పనుల్లో ముఖ్యమైన నెల్లికల్లు లిఫ్ట్ పనులను త్వరగా కంప్లీట్ చేయాలని స్మితా సబర్వాల్‌‌కు సూచించారు. కొన్నేండ్ల నుంచి పెండింగ్‌‌లో ఉన్న మిల్లర్ల సేల్స్ ట్యాక్స్ బకాయిలను సీఎం కేసీఆర్ మాఫీ చేశారు. దామరచర్ల వద్ద సీఎంను కలిసిన మిల్లర్లు రూ.250 కోట్ల బకాయిలను రద్దు చేయాలని కోరారు. ఆ బకాయిలను రద్దు చేస్తూ జీఓ ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.

పోడు సమస్యను పరిష్కరించండి

పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న దామరచర్ల మండలంలోని కల్లేపల్లి, నర్సాపురం, తిమ్మాపురం, పుట్టల గడ్డ, ఉల్పాయిపాలెం, కొత్త నందికొండ, చిట్యాల తదితర గ్రామాల్లో పోడు భూముల సమస్యను పరిష్కరించాలని చీఫ్ సెక్రటరీ సోమేశ్​కుమార్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.331.30 కోట్ల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం వెంట మంత్రులు జగదీశ్‌‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అధికారులు ఉన్నారు.

భవిష్యత్‌‌లో సోలార్‌‌ ప్లాంట్‌‌

పవర్‌‌ ప్లాంట్‌‌ ఆపరేషన్‌‌కు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా 30 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. పవర్‌‌ ప్లాంట్‌‌ నుంచి అన్ని ప్రాంతాలకు పవర్‌‌ కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణపట్నం పోర్టు, అద్దంకి హైవేను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఇక్కడి పవర్‌‌ ప్లాంట్‌‌ నిర్మిస్తున్నామని వివరించారు. ప్లాంట్‌‌లో పనిచేసే 10 వేల మంది సిబ్బందికి ఉపయోగపడేలా టౌన్‌‌షిప్‌‌ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఇదేప్రాంతంలో భవిష్యత్‌‌లో సోలార్‌‌ పవర్‌‌ ప్లాంట్‌‌ వస్తుందని, దీంతో సిబ్బంది సంఖ్య పెరుగుతుందని, దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ‘‘స్టాఫ్‌‌ క్వార్టర్స్‌‌, ఇతర సదుపాయాల కోసం వంద ఎకరాలు ప్రత్యేకంగా సేకరించాలి. స్పోర్ట్స్‌‌ కాంప్లెక్స్‌‌ కోసం 50 ఎకరాలు కేటాయించాలి. సూపర్‌‌ మార్కెట్‌‌, కమర్షియల్‌‌ కాంప్లెక్స్‌‌, క్లబ్‌‌ హౌస్‌‌, హాస్పిటల్‌‌, స్కూల్‌‌, ఆడిటోరియం, మల్టిప్లెక్స్‌‌ నిర్మించాలి” అని సూచించారు.