లక్ష లడ్డూలను సిద్ధం చేసిన యాదాద్రి ఆలయ సిబ్బంది

లక్ష లడ్డూలను సిద్ధం చేసిన యాదాద్రి ఆలయ సిబ్బంది

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి జనవరి 1న భక్తులు పెద్దఎత్తున వచ్చే అవకాశాలుండడంతో అందుకనుగుణంగా ఆలయ ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు. టెంపుల్ టైమింగ్స్ సైతం మార్చారు. గుడిని ఉదయం 3 గంటలకు, పాతగుట్ట ఆలయాన్ని 4.30 గంటలకు తెరవనున్నారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాతం, ఆరాధన, అర్చనలు, అభిషేకం నిర్వహించిన అనంతరం ఉదయం6.30 గంటలకు దర్శనాలు ప్రారంభించి రాత్రి 9 గంటల వరకు నిర్విరామంగా కొనసాగించనున్నారు. మధ్యలో బ్రేక్ దర్శనాలు, స్వామివారికి ఆరగింపు, నివేదన కైంకర్యాలు నిర్వహించనున్నారు. భక్తుల కోసం లక్ష లడ్డూలను రెడీ చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రసాదాల కౌంటర్లు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓపెన్ చేసి పెట్టనున్నారు.

2న ఉత్తర ద్వార దర్శనం

జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి ముందు ఆలయానికి ఉత్తర ద్వారం లేకపోవడంతో.. తూర్పు ద్వారం నుంచే స్వామివారు భక్తులకు దర్శనమిచ్చేవారు. పునర్నిర్మాణం తర్వాత ఆలయానికి నలువైపులా నాలుగు ద్వారాలు ఏర్పాటు చేయడంతో.. జనవరి 2న తొలిసారిగా ఉత్తర ద్వారదర్శనం ఇవ్వనున్నారు. అదేవిధంగా జనవరి 2 నుంచి అధ్యయనోత్సవాలు షురూ కానున్నాయి. జనవరి 2 నుంచి 7 వరకు ఆరు రోజుల పాటు అధ్యయనోత్సవాలు కొనసాగనున్నాయి. అధ్యయనోత్సవాల సందర్భంగా ఆరు రోజుల పాటు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు.