ఆన్‌లైన్‌లో నారసింహుడి బ్రేక్‌ దర్శన టికెట్లు

ఆన్‌లైన్‌లో నారసింహుడి బ్రేక్‌ దర్శన టికెట్లు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రేక్ దర్శన టికెట్లు గురువారం నుంచి ఆన్ లైన్​లోనూ అందుబాటులోకి వచ్చినట్లు  ఈవో గీతారెడ్డి చెప్పారు. అక్టోబర్ 31న తొలిసారిగా బ్రేక్ దర్శన టికెట్లను ప్రవేశపెట్టారు. ఇన్నాళ్లు ఆన్ లైన్ లో బ్రేక్ దర్శన టికెట్లు అందుబాటులో లేకపోవడంతో భక్తులు యాదగిరిగుట్టకు వచ్చి తీసుకోవాల్సి వచ్చేది. ఇకనుంచి దేవస్థానం అఫీషియల్ వెబ్ సైట్ http://yadadritemple.telangana.gov.in లో లాగిన్ అయి బ్రేక్ దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. బ్రేక్ దర్శన టికెట్ ధర రూ.300 ఉండగా ఉదయం 9 నుంచి 10 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనాలు కల్పిస్తారు. రష్ ఎక్కువగా ఉన్న సమయంలో, వీఐపీల తాకిడి అధికంగా ఉన్న సమయంలో ధర్మదర్శన క్యూలైన్లను నిలిపివేయాల్సి వస్తుండడంతో.. సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో బ్రేక్ దర్శనాలను అందుబాటులోకి తెచ్చామని ఈవో గీతారెడ్డి తెలిపారు.

15  రోజుల హుండీ ఆదాయం రూ. 1.88 కోట్లు

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి 15 రోజుల హుండీ ఆదాయం రూ.1,88,28,754 సమకూరిందని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. 70 గ్రాముల బంగారం, 3.6 కిలోల వెండి, విదేశీ కరెన్సీని భక్తులు సమర్పించారు. అక్టోబర్ 11న 28 రోజుల హుండీ కౌంటింగ్ ద్వారా రూ.1.89 కోట్లు రాగా.. గురువారం కేవలం 15 రోజుల హుండీ ఆదాయమే రూ.1.88 కోట్లుగా నమోదైంది.