
యాదగిరిగుట్ట, వెలుగు: గౌడన్నలు సహజ మరణం పొందినా బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొలగాని జయరాములు గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట మండలం మైలారుగూడెంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కోల వెంకటేశ్ గౌడ్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన యాదగిరిగుట్ట మండల కల్లుగీత కార్మిక సంఘం ఆరో మహాసభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గీత కార్మికులు ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి చనిపోతే ప్రస్తుతం ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. అనారోగ్యం కారణంగా గౌడన్నలకు సహజ మరణం సంభవించినా బాధిత ఫ్యామిలీకి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించేలా గీతన్న బీమా పథకంలో మార్పులు చేయాలని సూచించారు.
గీత వృత్తిని ఆధునీకరించి గౌడన్నలకు కాటమయ్య రక్షణ కవచాలు అందించి ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న గీత కార్మికుల ఎక్స్ గ్రేషియా నిధులను వెంటనే విడుదల చేయాలని, గౌడన్నల వృద్ధాప్య పింఛన్ రూ. 4 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులకు మోటార్ సైకిళ్లు ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కోల వెంకటేశ్ గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు హేమేందర్ గౌడ్, శ్రీరాంమూర్తి గౌడ్, జిల్లా నాయకులు గొట్టిపర్తి బాలరాజు గౌడ్, కృష్ణ గౌడ్, మండల నాయకులు మిట్ట వెంకటయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ముత్యాలు గౌడ్, కృష్ణయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.