
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 15 నుంచి 17 వరకు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఈవో వెంకట్రావు తెలిపారు. శ్రీవైష్ణవ పాంచరాత్ర ఆగమ శాస్త్రం పద్దతిలో మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు.
15న ఉదయం కణ్ణన్ పెరుమాళ్, లక్ష్మీనరసింహస్వామి ఉత్సవమూర్తులకు నవకలశ స్నపన విశేష తిరుమంజన సేవ నిర్వహించి కృష్ణాష్టమి వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. 17న సాయంత్రం 5 గంటలకు ప్రధానాలయ తూర్పు రాజగోపురం ఎదుట శిఖ్యోత్సవం(ఉట్లు కొట్టడం), రాత్రి 8 గంటలకు శ్రీకృష్ణ, రుక్మిణీ కల్యాణం నిర్వహించనున్నారు. 15న నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమం, భోగాలు తాత్కాలికంగా రద్దు చేశారు.