
యాదగిరిగుట్ట, వెలుగు: శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు షురూ అయ్యాయి. కొండపైన పర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి(శివాలయం) ఆలయంలో ఉదయం విఘ్నేశ్వర పూజ, స్వస్తివాచనం, రుత్విగ్వరణంతో దేవీ శరన్నవరాత్రులను ఆలయ అర్చకులు ప్రారంభించారు.
తొలిరోజు పూజల్లో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో వెంకటరావు, డిప్యూటీ ఈవో దోర్బాల భాస్కర్ శర్మ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వచ్చే నెల 2 వరకు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ఉదయం అఖండ దీపారాధన, అంకురారోపణం, మండపారాధన, కలశ స్థాపన, శ్రీదేవి పూజ, మూలమంత్ర జప, సప్తశతీ, లలితా పారాయణాలు నిర్వహించారు. సాయంత్రం నవావరణ పూజ, చరుష్ట ఉపచారయుక్త సహస్రనామార్చన, నీరాజన మంత్రపుష్పాలు, దేవీ త్రికాల పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు.