- యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో వెంకటరావు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తుల్లో వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు తగ్గించి సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆలయ ప్రొటోకాల్ విభాగం అధికారులకు ఆలయ ఈవో వెంకటరావు ఆదేశించారు. ఆలయ ప్రొటోకాల్ విభాగం సహా పలు విభాగాల్లో సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. భక్తుల సౌకర్యార్థం కొనసాగుతున్న పలు రకాల సేవలు, కార్యక్రమాలను సమీక్షించారు.
అనంతరం భక్తులు సౌకర్యార్థం శివాలయంలో నూతనంగా అందుబాటులో తెచ్చిన ‘ఉచిత ప్రసాద వితరణ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక భక్తుల కోసం ప్రతి మంగళవారం, శనివారం అమలు చేస్తున్న ఉచిత దర్శన పథకాన్ని పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న కారణంగా మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా అదనపు చర్యలు చేపట్టాలని సూచించారు.
శివాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఉచిత ప్రసాద వితరణ’ కార్యక్రమం ద్వారా ప్రతి సోమవారం భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. అనంతరం ప్రసాద తయారీ కేంద్రాన్ని పరిశీలించి భక్తులకు రుచికరమైన, నాణ్యతతో కూడిన ప్రసాదం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కియోస్క్ యంత్రాల పనితీరును పరిశీలించి, కియోస్క్ యంత్రాల ద్వారా టికెట్లు పొందిన భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
పాతగుట్టలో అభివృద్ధి పనులకు ఈవో ఆమోదం
యాదగిరిగుట్ట క్షేత్రానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఈవో వెంకటరావు ఆమోదం తెలిపారు. సోమవారం ఆలయ అధికారులతో కలిసి పాతగుట్టను ఆయన సందర్శించారు. భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలు, అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఆలయంలో నూతనంగా నిర్మించే అద్దాల మండపం నిర్మాణం, ఆంజనేయస్వామి ఆలయ పునరుద్ధరణ, పుష్కరిణి వద్ద వెళ్లే మెట్ల మార్గానికి రేలింగ్, షెడ్ ఏర్పాటు, ఆలయ పరిసర ప్రాంతంలో కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు ఆమోదం తెలిపిన ఈవో.. వెంటనే పనులు షురూ చేయాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు.
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల పట్ల ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా వ్యవహరించి, భక్తుల విశ్వాసం చురగొనేలా సేవాభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ దయాకర్ రెడ్డి, ఏఈవోలు గజవెల్లి రఘు, నవీన్, మహేష్, ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు, సూపరింటెండెంట్ రాజన్ బాబు తదితరులు ఉన్నారు.
