- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవో వెంకటరావు
యాదగిరిగుట్ట, వెలుగు: కార్తీకమాసం చివరి వారం కారణంగా భక్తుల రద్దీ అధికంగా ఉండనున్న నేపథ్యంలో శని, ఆది, సోమవారం రోజుల్లో వచ్చే వీఐపీలకే ప్రొటోకాల్ దర్శనాలు పరిమితం చేయాలని, ఏజెంట్లు, రిఫరెన్స్ ప్రొటోకాల్ లు పూర్తిగా నిషేధించాలని ఆలయ అధికారులకు ఆలయ ఈవో వెంకటరావు స్పష్టం చేశారు. గురువారం యాదగిరిగుట్టపైన ఈవో కార్యక్రమంలో అన్ని విభాగాల ఆలయ అధికారులతో కలిసి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
అర్హత కలిగిన ప్రొటోకాల్ వ్యక్తులు నేరుగా వచ్చిన వారికి, ముందస్తు లేఖలతో అర్హత కలిగివారికి మాత్రమే ప్రొటోకాల్ దర్శనాలకు అనుమతించాలని ఆదేశించారు. లేఖలు లేకుండా ప్రొటోకాల్ దర్శనాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దని, ఎలాంటి మినహాయింపు లేకుండా ఆదేశాలు అమలు చేయాలని ప్రొటోకాల్ అధికారులకు తేల్చి చెప్పారు. ప్రొటోకాల్ దర్శనాలు తగ్గించి సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అనధికారిక షాపులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు
ఆలయ పరిసరాల్లో ప్రైవేట్ ప్రకటనలు, ఫ్లెక్సీలు నిషేధించిన కారణంగా.. వాటిని ఏర్పాటు చేయకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆలయానికి చెందిన భూములు, ఖాళీ ప్రదేశాలు కబ్జాకు గురికాకుండా కాంపౌండ్ వాల్ లు, బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ పరిసరాల్లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన షాపులు, స్టాళ్లు తొలగించాలని, ఎవరైనా అనధికారికంగా షాపులు, స్టాళ్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇక ఆలయానికి సంబంధించిన టెండర్లు, లీజులు పక్షపాతం లేకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని, దేవాలయ నియంత్రణలో ఉన్న అన్ని రకాల దుకాణాల వద్ద ధరల వివరాలతో కూడిన బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. భక్తులు చెల్లించే కానుకతోనే జీతాలు తీసుకుంటున్నామనే విషయాన్ని గుర్తించుకుని సేవా భావంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో భాస్కర్ శర్మ, ప్రధానార్చకులు సురేంద్రాచార్యులు, ఈఈ దయాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ రాజన్ బాబు, వాసం వెంకటేశ్, ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
