దేశ రాజధాని ఢిల్లీకి వరద గండం పొంచి ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో… యమునా నది పరవళ్లు తొక్కుతోంది. హత్నీకుండ్ ప్రాజెక్ట్ నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో ఢిల్లీకి యమున పోటెత్తుతోంది . యమునలో నీటిమట్టం అంతకంతకూ పెరిగి.. నిన్న సాయంత్రానికి డేంజర్ మార్క్ దాటింది. నదిలో నీటి మట్టం 205 .94 మీటర్లకు చేరింది. ఓల్డ్ లోహా బ్రిడ్జ్ దగ్గర డేంజర్ లెవెల్ 205.33 మీటర్లు ఉండగా… 0.61 మీటర్లు ఎక్కువ ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. ఓల్డ్ లోహా బ్రిడ్జ్ ను క్లోజ్ చేశారు. ట్రాఫిక్ ను అనుమతించడంలేదు. పాదచారులను కూడా రానివ్వడంలేదు. నిగంబోధ్ ఘాట్ లోకి వరద నీరు చేరింది.
తూర్పు ఢిల్లీలోని యమునా నది వెంబడి ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. దాదాపు 7 వేల మందిని షిఫ్ట్ చేసినట్టు తెలిపారు. వారందరి కోసం 11వందల టెంట్లు ఏర్పాటు చేశామన్నారు. వారికి హెల్త్ చెకప్స్ కూడా చేస్తున్నట్టు చెప్పారు ఈస్ట్ ఢిల్లీ అధికారులు. వరద పరిస్థితిని నిరతంరం మంత్రులు పర్యవేక్షిస్తున్నారని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. నదిలోకి ఎవరూ దిగకుండా నిరంతరం పహారా కాస్తున్నారు మున్సిపల్ సిబ్బంది.
బోట్లలో పెట్రోలింగ్ చేస్తూ పరీవాహక ప్రజలను అలర్ట్ చేస్తున్నారు పోలీసులు. యమునా నది పరీవాహక ప్రాంతమైన హర్యానాలోని కర్నాల్ జిల్లాలో అనేక గ్రామాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. యమునా నది మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉండటంతో ఢిల్లీలోని తీర ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు.
