యమునా నదికి వరద పోటు..నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

యమునా నదికి వరద పోటు..నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
  • యమునా నది వరద బాధితులకు రోడ్లపైనే షెల్టర్

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం నడిబొడ్డు నుంచి వెళ్లే యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువన నది పరివాహక  ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు యుమునా నదికి వరద పోటెత్తుతోంది. నదికి ఇరువైపులా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ ప్రాంతాలన్నీ నీట మునుగుతుండడంతో అధికారులు అప్రమత్తమై నది పరివాహక ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు. యమునా నది వరద బాధితులకు రోడ్లపైనే షెల్టర్లు ఏర్పాటు చేసి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. 

గరిష్ట స్థాయికి వరద ప్రవాహం

యమునా నదిలో వరద ప్రవాహం ఇవాళ ఉదయం గరిష్ట స్థాయికి చేరుకుంది. హరియాణాలోని యమునా నగర్ బ్యారేజీ, హత్నీకుండ్ బ్యారేజీ వద్ద లక్ష్య క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదు అయింది. ఢిల్లీ చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు నదీ తీర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి నదీ ప్రవాహం గరిష్ఠ స్థాయికి అంటే  205.33 దాటి 205.38మీటర్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

ఢిల్లీ చుట్టుపక్కల ప్రమాద హెచ్చరికలు

యమునా నదికి వరద పోటెత్తడంతో ఢిల్లీ చుట్టుపక్క ప్రాంతాల్లో అధికారులు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ముప్పు పొంచివున్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సరైన వసతులు లేక చాలా చోట్ల రోడ్లపైనే షెల్టర్ కల్పిస్తున్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు నదిలోకి భారీగా వరద నీరు వస్తోంది. వరద బాధితుల కోసం రోడ్లమీద షెల్టర్ ఏర్పాటు చేసిన ఢిల్లీ ప్రభుత్వం.. బాధితులకు నిత్యం తాగునీరు, ఆహారం సరఫరా చేస్తున్నారు. యమునా నది వరదతో ఇళ్లన్నీ నీట మునగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్ధితి దయనీయంగా తయారైంది. వరద వల్ల తమ ఇళ్లు, వాకిలి, సామాన్లు, సరుకులు అన్నీ కొట్టుకుపోయాయని.. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామంటూ వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.