విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా య‌శ్వంత్ సిన్హా..?

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా య‌శ్వంత్ సిన్హా..?

రాష్ట్రపతి ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా మాజీ కేంద్ర మంత్రి య‌శ్వంత్ సిన్హా పేరు వినిపిస్తోంది. గ‌తంలో బీజేపీలో మంత్రిగా చేసిన య‌శ్వంత్ .. ప్రస్తుతం తృణ‌మూల్ కాంగ్రెస్‌లో ఉన్నారు. అయితే ఆ పార్టీ కార్యకలాపాల నుంచి త‌ప్పుకోనున్నట్లు ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇటీవలే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ విషయంపై చర్చించినా.. ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ తాజాగా యశ్వంత్.. చేసిన ట్వీట్ తో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని ప్రకారం ఆలోచిస్తే.. విపక్షాల తరపు నుంచి యశ్వంత్ సిన్హా బరిలో దిగనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

రాష్ట్రపతి పదవికి పోటీపడేందుకు ముందు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరును ప్రస్తావించగా.. అందుకు ఆయన నో చెప్పారని సమాచారం. ఆ తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా సైతం పోటీ చేయలేనని తప్పుకున్నారు.  అనంతరం బెంగాల్‌ మాజీ గవర్నర్‌, మహత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పేరును టీఎంసీ చీఫ్ మమత ప్రతిపాదించగా, ఆయన కూడా పోటీ చేయబోనని కుండబద్దలుకొట్టారు. మొత్తం ప్రతిపక్ష నాయకుల్లో గోపాలకృష్ణ పట్ల ఏకాభిప్రాయం లేకపోవడం, కొన్ని పార్టీలు సమావేశానికి హాజరవకపోవడంతోనే ఆయన వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే అనూహ్యంగా యశ్వంత్ సిన్హా పేరు తెరపైకి రావడంతో పోటీ ఆసక్తికరంగా మారే అవకాశముంది. మరో వైపు ఇవాళ అధికార బీజేపీ పార్టీ కూడా త‌మ అభ్యర్థిని తేల్చనుంది. పార్లమెంట‌రీ బోర్డు మీటింగ్‌కు ప్రధాని మోదీ వ‌ర్చువ‌ల్‌గా హాజ‌రుకానున్నారు. జూలై 18వ తేదీన రాష్ట్రప‌తి ఎన్నిక జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.