వారాహియాత్రలో పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. జనసేన అధినేత గతంలో కూడా వారాహి యాత్ర చేశాడు. మళ్లీ ఇప్పుడు చేస్తున్నాడు. దాని గురించి కొత్తగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదన్న వైవీ సుబ్బారెడ్డి... అప్పుడు పెట్టుకున్న పొత్తులు బయట పడ్డాయన్నారు. ఇప్పుడు చంద్రబాబు జైలుకు వెళ్లడంతో సింపతికోసం పవన్ కల్యాణ్ తో పొత్తులు పెట్టుకున్నాడని ఆరోపించారు. తప్పు చేసి జైలులో ఉన్న వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తారని ప్రశ్నించారు. అంతకుముందు విశాఖ ఎయిర్ పోర్టులో ఆయనకు వైసీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
విశాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి నెల వస్తున్నారంటూ.. పరిపాలన విషయంలో అధికారులు తగు ఏర్పాట్లు చేసిన వెంటనే పూర్తిగా ఇక్కడ నుండి పాలన కొనసాగిస్తారని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. చంద్రబాబు విషయంలో న్యాయస్థానం కూడా సరైన నిర్ణయాన్ని ప్రకటించడం వలన ప్రజలకు న్యాయస్థానాల పట్ల మరింత గౌరవం పెరిగిందన్నారు. చట్టం అందరికీ సమానమే అని, తప్పుచేసిన ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు వైవీ సుబ్బారెడ్డి.