ఆ ధోని ఒక్కడే వరల్డ్ కప్ గెలిచాడు.: హర్భజన్ సింగ్

ఆ ధోని ఒక్కడే వరల్డ్ కప్ గెలిచాడు.: హర్భజన్ సింగ్

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎంతటి విజయవంతమైన నాయకుడో అందరికీ విదితమే. అతని ఆట తీరు, నడుచుకునే విధానం.. స్టంపింగ్‌లో చురుకుదనం ఒక ఎత్తైతే.. అతని వ్యూహరచనలు మరో ఎత్తు. ధోనీ కెప్టెన్సీలో నాలుగు సార్లు ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌కి అర్హత సాధించిన టీమిండియా, మూడింట్లో విజయం సాధించింది. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. 

ఇవన్నీ ధోని ఒక్కడి వల్లే సాధ్యమయ్యాయా? అంటే కాదు.. జట్టు సమిష్టి సృష్టితో. అది అర్థం చేసుకోని అభిమానులు ధోనీపై పొగడ్తలు కురిపించగా, మాజీ దిగజ్జం హర్భజన్ సింగ్ వారి నోరు మూయించేలా సమాధానమిచ్చాడు. టీమిండియా ఏ ఐసీసీ టోర్నీలో ఓడినా వెంటనే ధోని ప్రస్తావన రావడమన్నది కామన్. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌లో రోహిత్ సేన పరాజయం తర్వాత మరోసారి ధోని ట్రెండింగ్‌లో నిలిచాడు. భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ధోని నామస్మరణతో  హోరెత్తించారు. 

ఈ క్రమంలో ఒక అభిమాని 2007 టీ20 వరల్డ్ కప్ విజయాన్ని ప్రస్తావిస్తూ..'కోచ్ లేరు.. మెంటార్ లేరు.. ఇంతకు ముందు ఏ ఒక్క మ్యాచ్‌కి కెప్టెన్సీ చేయలేదు. అలాంటి వ్యక్తి సెమీఫైనల్స్‌లో బలమైన ఆస్ట్రేలియాను ఓడించాడు. కెప్టెన్ అయిన తర్వాత 48 రోజుల్లోనే దేశానికి టీ20 ప్రపంచ కప్‌ సాధించిపెట్టాడు..' అని కామెంట్ చేశాడు. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయ్యాడు.

"'ఆ అవును, భారత్ తరుపున యువ ఆటగాడు ధోని ఒక్కడే అన్నిమ్యాచులు గెలిచాడు. మిగిలిన 10 మంది ఆడలేదు. ధోని ఒంటరిగా వరల్డ్ కప్ సాధించాడు. ఆస్ట్రేలియా అయినా.. మరే దేశమైనా వరల్డ్ కప్ గెలిస్తే, ఆ దేశం గెలిచిందని రాస్తారు. కానీ మన దేశంలోదేశానికి ఆపాదించరు. కెప్టెన్ ధోని గెలిచాడు, కెప్టెన్ రోహిత్ గెలిచాడు.. అంటూ కెప్టెన్లకు క్రెడిట్ ఇస్తారు. క్రికెట్ అనేది టీమ్ గేమ్. గెలిస్తే అందరు కలిసి గెలుస్తారు, ఓడితే అందరు కలిసి ఓడుతారు..' అంటూ హర్భజన్ సింగ్ కౌంటరిచ్చాడు. తామందరం కష్టపడి టీమిండియాకు విజయాలను అందించామని చెప్పేందుకే భజ్జీ ఇలా మాట్లాడినట్లు అర్థమవుతోంది.