బీపీ కంట్రోల్‌లో ఉంచుకునేందుకు యోగ ఆసనాలు

బీపీ కంట్రోల్‌లో ఉంచుకునేందుకు యోగ ఆసనాలు

తినే తిండి వల్లో, పని ఒత్తిడి వల్లో లేదా ఇతర కారణాల వల్లో ఈ మధ్య చాలామందికి బ్లడ్‌ ప్రెజర్‌‌ (బీపీ) కంట్రోల్‌లో ఉండట్లేదు. బీపీ కంట్రోల్‌లో లేకపోతే గుండె, కిడ్నీ సంబంధ సమస్యలు వస్తాయని చెప్తుంటారు డాక్టర్లు. అందుకని డైట్‌ పాటిస్తూ, మందులు వాడుతూ బీపీ కంట్రోల్‌లో ఉంచుకుంటారు చాలామంది. వాటితో పాటు కొన్ని యోగ ఆసనాలు కూడా వేయాలి అని చెప్తున్నాడు యోగా గురువు డాక్టర్‌‌. సురేందర్‌‌ చౌదరి.

  • చేతులు, నడుము, కాళ్ల నుండి గుండెకు రక్త ప్రసరణ బాగా జరగడానికి, మనసు ప్రశాంతంగా ఉండటానికి అధో ముఖ స్వానాసనం ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే.. బోర్లా పడుకొని, చేతులపై బరువు పెట్టి శరీరాన్ని  నెమ్మదిగా పైకి ఎత్తాలి. తరువాత నడుము భాగాన్ని పైకెత్తి నిటారుగా ఉంచాలి.
  • మరొకటి ఉత్తనాసనం. దీన్ని వేసేందుకు కాళ్లు దగ్గరికి పెట్టి నిల్చోవాలి. నడుము ముందుకు వంచి చేతులతో నేలను తాకాలి. ఈ ఆసనం వేయడం వల్ల నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. అయితే ఈ ఆసనం ఎక్స్​పర్ట్స్​ సలహాతోనే చేయాలి.
  • ఒత్తిడి తగ్గడానికి పశ్చిమోత్తనాసనం బాగా సాయపడుతుంది. అంతేకాకుండా యాంగ్జైటీ, కోపం, చిరాకు పోగొడుతుంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే.. కింద కూర్చొని కాళ్లు ముందుకు చాపాలి. తరువాత చేతులతో పాదాలు పట్టుకొని, తలను మోకాళ్లకు ఆన్చాలి.