
యూపీ : ప్రధాని భద్రతా వైఫల్యం వెనుక పంజాబ్ ప్రభుత్వ కుట్ర దాగి ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన కుట్ర అని అన్నారు. ప్రధాని భద్రత విషయంలో పంజాబ్ సర్కారు ప్రోటోకాల్ పాటించలేదని యోగి మండిపడ్డారు. మోడీ కాన్వాయ్ ఫ్లై ఓవర్ పై చిక్కుకుపోయిన సమయంలో డ్రోన్ లేదా ఇతర దాడులు జరిగే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని అన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని యోగి ఆదిత్యనాథ్ డిమాండ్ చేశారు.
ఈ నెల 5న ప్రధాని నరేంద్రమోడీ పంజాబ్ ఫిరోజ్ పూర్ పర్యటకు వెళ్తుండగా కొంతమంది నిరసనకారులు రోడ్డు దిగ్బంధించారు. దీంతో ఓ ఫ్లై ఓవర్ పై 15 -20 నిమిషాల పాటు చిక్కుకుపోయిన మోడీ.. కార్యక్రమాన్ని రద్దు చేసుకుని ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం హోంశాఖ దీన్ని పంజాబ్ ప్రభుత్వ భద్రతా వైఫల్యంగా పేర్కొంది. తాజాగా మోడీ భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఇందూ మల్హోత్రా కమిటీకి నేతృత్వం వహిస్తారని ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని వార్తల కోసం..