నువ్వో చిన్న పిల్లాడివి.. తేజస్వీ యాదవ్‌‌‌‌పై నితీశ్ ఫైర్.. బిహార్‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీలో మాటల యుద్ధం

నువ్వో చిన్న పిల్లాడివి.. తేజస్వీ యాదవ్‌‌‌‌పై నితీశ్ ఫైర్.. బిహార్‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీలో మాటల యుద్ధం

పాట్నా: బిహార్‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. రాష్ట్రంలో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ప్రశ్నించగా, సీఎం నితీశ్ కుమార్ మండిపడ్డారు. ‘నువ్వో చిన్న పిల్లాడివి. నీకు ఇలాంటి వాటి గురించి ఏమీ తెలియదు’ అని ఫైర్ అయ్యారు. 

బుధవారం (జులై 23) ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగానే, ఓటర్ల జాబితా సవరణ అంశంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ నందకిశోర్ అనుమతితో తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ఓటర్ల జాబితా సవరణను మేం వ్యతిరేకించడం లేదు. 

కానీ ఈ ప్రక్రియ పారదర్శకంగా జరగట్లేదు. ఎన్నికలకు ముందు చేపట్టడం ఏంటి? ఓటర్ల జాబితాలో విదేశీయుల పేర్లు ఉన్నాయని ఈసీ చెబుతున్నది. చివరిసారి 2003లో ఓటర్ల జాబితా సవరణ చేపట్టారు. మళ్లీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టలేదు. అంటే ఫేక్ ఓటర్ల ద్వారానే మోదీ ప్రధాని, నితీశ్ సీఎం అయ్యారా? ఆ ఓటర్ల ద్వారానే మనమంతా 
ఇక్కడ కూర్చున్నామా?’’ అని ప్రశ్నించారు. 

అందుకే మీతో విడిపోయా.. 

తేజస్వీ యాదవ్ మాట్లాడుతుండగానే సీఎం నితీశ్ కుమార్ కలగజేసుకున్నా రు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.  ‘‘నువ్వో చిన్న పిల్లాడివి. నీకు ఇలాంటి విషయాల గురించి ఏమీ తెలియదు. అసెంబ్లీ చివరి సెషన్‌‌‌‌లో ఇంకా మూడ్రోజులే మిగిలి ఉన్నాయి. సభా వ్యవహారాలు జరగనివ్వండి. మీరు ఏ చెత్తా మాట్లాడాలని అనుకున్నా.. ఎన్నికల టైమ్‌‌‌‌లో మాట్లాడవచ్చు” అని తేజస్వీపై నితీశ్ ఫైర్ అయ్యారు. 

‘‘నువ్వు చిన్నగా ఉన్నప్పుడు.. మీ నాన్న, మీ అమ్మ చెరో ఏడేండ్లు సీఎంలుగా పనిచేశారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? రాత్రిపూట అడుగు బయటపెట్టే పరిస్థితి ఉండేది కాదు. మహిళలు, ముస్లింల కోసం మీరు ఏం చేశారు? మేం అన్నివర్గాల అభివృద్ధికి కృషి చేశాం. మీతో కొంతకాలం నడిచా. కానీ మీ పద్ధతి నచ్చక బయటకు వచ్చా. మేం (జేడీయూ, బీజేపీ) మొదటి నుంచి కలిసే ఉన్నాం. ఎప్పటికీ కలిసే ఉంటాం” అని చెప్పారు.