
న్యూఢిల్లీ: భారత ప్రధాని మోడీని ట్రంప్ గొప్ప స్నేహితుడిగా భావిస్తారని భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ అన్నారు. శనివారం (అక్టోబర్ 11) ఢిల్లీలో ప్రధాని మోడీతో సెర్గియో గోర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ‘ప్రైమ్ మినిస్టర్ మోడీ మీరు గొప్పవారు’ అంటూ ట్రంప్ సంతకం చేసిన ఫొటోను మోడీకి బహుకరించారు. అనంతరం రక్షణ, వాణిజ్యం, సాంకేతికతతో సహా ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు చర్చించారు.
ఈ భేటీ అనంతరం సెర్గియో గోర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని మోడీతో అద్భుతమైన సమావేశం జరిగిందని తెలిపారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికతతో సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించామని చెప్పారు. అరుదైన ఖనిజాల ప్రాముఖ్యత గురించి కూడా డిస్కస్ చేశామన్నారు. అమెరికాతో బంధానికి ఇండియా విలువ ఇస్తుందని.. ట్రంప్, మోడీ బలమైన నాయకత్వంలో రెండు దేశాలకు రాబోయే రోజులు ఆశాజనంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మోడీని ట్రంప్ గొప్ప వ్యక్తిగత స్నేహితుడిగా భావిస్తారని చెప్పారు
అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తో భేటీ వివరాలను ప్రధాని మోడీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. భారతదేశానికి అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్‌ను స్వాగతించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఆయన పదవీకాలం భారతదేశం-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, భారత ఎగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలను విధించిన తర్వాత న్యూఢిల్లీ-వాషింగ్టన్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ సమయంలో ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన సెర్గియో గోర్ ప్రధాని మోడీతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.