
ఫోన్ వదిలేసి.. జీవితాన్ని పట్టుకోండి
ఒకప్పుడు టెన్త్ క్లాస్ చదివే పిల్లాడికే పెద్దయ్యాక ఏమవ్వాలనే ఆలోచన ఉండేది. డిగ్రీకి వచ్చాక ‘కచ్చితంగా ఈ ఉద్యోగం సంపాదించాలి. జీవితంలో సెటిలవ్వాలి’ అనే క్లారిటీ వచ్చేది. కానీ ఇప్పుడు.. స్కూల్ పిల్లాడి నుంచి జాబ్ ట్రయల్స్‌లో ఉన్న కుర్రాడి వరకు అందరూ స్మార్ట్ ఫోన్లలో బిజీ అయిపోయారు. రోజులో ఏడెనిమిది గంటలు వీడియో గేమ్స్, సోషల్ మీడియాలో గడుపుతున్నారు. దాంతో ఈ జనరేషన్‌కు లైఫ్ మీద సీరియస్‌నెస్ తగ్గిపోయింది. ఒక లక్ష్యం లేకుండా గడిపేస్తున్నారని వాపోతున్నాడు ఇండియన్ ఫేమస్ రైటర్ చేతన్ భగత్. ఈ జనరేషన్ 4జీ ఫోన్లతో అందమైన జీవితాలను ఎలా నాశనం చేసుకుంటోంది అనే విషయంపై ఒక ఓపెన్ లెటర్ రాశాడు.
చేతన్ భగత్ రాసిన ఫిక్షన్, నాన్ ఫిక్షన్ నవలల్లో ఎక్కువగా యూత్‌కి సంబంధించిన అంశాలే ఉంటాయి. అలాగే 2010లో టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్’ లిస్ట్‌లో చేతన్ భగత్ ఉన్నాడు. ఎప్పుడూ తన నాన్ ఫిక్షన్ నవలల్లో, పలు ఇంగ్లీష్, హిందీ పేపర్లలో రాసే కాలమ్స్‌లో కూడా యువతను మోటివేట్ చేసే టాపిక్స్ ఎంచుకుంటాడు. అలా ఇప్పుడు కూడా యువత స్మార్ట్ ఫోన్లలో పడి తమ జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటోందని ఆ లెటర్లో చెప్పాడు. ఆ ఓపెన్ లెటర్ని ‘డియర్ ఫ్రెండ్స్…’ అంటూ మొదలుపెట్టి ‘లవ్’ అని ముగించాడు. ఆ లెటర్ సారాంశం ఇది…
స్క్రీన్ టైమ్ తగ్గించుకుంటేనే..
ఇప్పటి జనరేషన్ పూర్తిగా ఫోన్లు, వీడియోలు, వీడియో గేమ్స్ ఆడటం, ఫ్రెండ్స్‌తో చాటింగ్, సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం, సెలబ్రిటీల పోస్ట్‌లను షేర్ చేయడం వంటి పనుల్లో పూర్తిగా మునిగిపోయారు. అంతేతప్ప, తమ జీవితం గురించి ఆలోచించడానికి టైం కేటాయించట్లేదు. స్మార్ట్‌ఫోన్లు, తక్కువ ధరకు ఇంటర్నెట్ వాడుతున్న మొదటి జనరేషన్ అయ్యుండి.. దాన్ని ఏవిధంగానూ మంచి పనికి ఉపయోగించట్లేదు. రిటైరై ఇంట్లో ఉంటున్నవాళ్లు, బిజినెస్‌లో సెటిలైనవాళ్లు గంటల తరబడి ఆన్లైన్లో స్పెండ్ చేస్తే వచ్చే నష్టం ఉండదు. కానీ లైఫ్‌ని అందంగా, గొప్పగా తీర్చిదిద్దుకోవాల్సిన యువత ఇలా ఫోన్లు పట్టుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు.
4జీ జనరేషన్.. ఫర్గెటెన్ జనరేషన్ అవ్వొచ్చు
స్మార్ట్ ఫోన్లలో రోజుకు ఐదు గంటలు గడుపుతున్నారంటే.. జీవితంలోని మూడొంతుల్లో ఒకవంతును వేస్ట్ చేస్తున్నట్లే. అంతేకాదు సిగరెట్స్, డ్రగ్స్‌లాగే ఈ ఫోన్ అడిక్షన్ కూడా జీవితాన్ని నాశనం చేస్తుంది. పనికి రాని ఆలోచనలతో మెదడు పూర్తిగా నిండిపోయి, కెరీర్‌ని బిల్డ్ చేసే అంశాలు దూరమవుతాయి. ఇలాంటి పరిస్థితే ఇంకా కొనసాగితే ఫోర్ జీ జనరేషన్ కాస్త ఫర్గెటెన్ జనరేషన్ (ప్రపంచం మొత్తం మర్చిపోయే తరంగా)గా మారుతుంది.
మార్పు మనలోనే రావాలి
ఈ మధ్య సోషల్ మీడియాలో యువత అనవసరమైన విషయాలపై ఎక్కువ ఫోకస్డ్గా ఉంటోంది. ‘ఆ పొలిటీషియన్ తీరు బాలేదు.. ఈ పార్టీ వాళ్లది తప్పు’, ‘నెపోటిజం వల్లే ఆ యాక్టర్ చనిపోయాడు.. ఇండస్ట్రీలో నెపోటిజం తగ్గేదాకా ఆన్లైన్ క్యాంపెయిన్లు చేస్తాం’, వంటి అంశాల మీద కామెంట్లు పెడుతూ అదే జీవితం అనుకుంటున్నారు. వీటిపై పెడుతున్న అనాలిసిస్ టాలెంట్, టైంని చదువు లేదా ఫ్యూచర్ గోల్స్ మీద పెడితే కచ్చితంగా జీవితంలో సక్సెస్ వస్తుంది. అంతేతప్ప ఏ ఒక్క పొలిటీషియన్, ఏ బాలీవుడ్ సెలబ్రిటీ మనల్ని చేయిపట్టుకుని నడిపించరు. ఎదుటివాళ్లను తప్పుబట్టడం ఆపేయాలి. క్రియేటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టాలి. 4జీ ఫోన్లు కూడా డ్రగ్స్ లాంటివే. కాకపోతే ఇవి లీగల్. అంతమాత్రాన వాటిని డ్రగ్స్‌లాగా మనసుకు అలవాటు చేసుకోవద్దు. వాటిని కేవలం సమాచారం, షాపింగ్, ఆన్లైన్ క్లాసుల కోసం ఉపయోగించుకోవడం మంచిది. అలా అవసరమైన వాటికి మాత్రమే స్మార్ట్ ఫోన్‌ని వాడుతూ, ఫ్యూచర్ కోసం ఎక్కువ టైమ్, స్కిల్స్‌ని వాడితే సొసైటీలో మీరే సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు. ఇలా సాగింది చేతన్ భగత్ ఓపెన్ లెటర్
ఫోన్ అలవాటుతో నష్టాలు
ఫోన్‌కి అలవాటు పడటం పూర్తిగా టైం వేస్ట్ పని. ఆ టైంని ప్రొడక్టివ్ పనుల కోసం ఉపయోగించాలి. ఉదాహరణకు ఫోన్‌ని పక్కనబెట్టి మూడు గంటలపాటు ఫిట్నెస్, అకడమిక్ బుక్స్ లేదా మోటివేషనల్ బుక్స్ చదవడం, కొత్త స్కిల్‌ని నేర్చుకోవడం, కోరుకున్న జాబ్ కోసం ట్రయల్స్, చిన్న బిజినెస్ స్టార్ట్ చేయడం వంటి పనులకు కేటాయిస్తే, జీవితంలో మార్పు మొదలవుతుంది. అలాకాకుండా ఏ పూటకు ఆ పూట గడిపితే భవిష్యత్ శూన్యంగా మిగులుతుంది.
మన బ్రెయిన్లో రెండు భాగాలుంటాయి. ఒకటి కాగ్నిటివ్, మరొకటి ఎమోషనల్. మెదడు పనితీరు బాగుండాలంటే ఆ రెండూ యాక్టివ్‌గా ఉండాలి. అయితే ఏవిధంగానూ పనికి రాని స్టఫ్‌ను చూడటం వల్ల కాగ్నిటివ్
బ్రెయిన్ మొద్దుబారుతుంది. సోషల్ మీడియాలో ఎక్కువగా ఎంటర్టైనింగ్ కంటెంట్ చూడటంతో ఎమోషనల్ బ్రెయిన్ మాత్రమే పని చేస్తుంది. దానివల్ల లాజికల్‌గా ఆలోచించే తత్వం కోల్పోతారు. ఒక అంశాన్ని పలురకాలుగా అనలైజ్ చేయలేక తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువ.
గంటల తరబడి స్క్రీన్‌ని చూడటం వల్ల మోటివేషన్, ఎనర్జీని పూర్తిగా కోల్పోతారు. అసలు జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందు ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. దాన్ని చేరుకోవడానికి మోటివేషన్, వర్కింగ్ అవర్స్ పెంచుకోవడం ముఖ్యం. కానీ ఇలా స్క్రీన్ ముందు కూర్చోవడం అలవాటైతే బద్ధకం వచ్చేస్తుంది. ఓడిపోతామన్న భయం వెంటాడుతుంది. అందువల్ల మొదలుపెట్టిన ఏ పనినీ పూర్తి చేయలేరు.
For More News..