పాకిస్తాన్‌‌లో ఇండస్ట్రీలు బ్యాన్ చేయాలంటరా?

పాకిస్తాన్‌‌లో ఇండస్ట్రీలు బ్యాన్ చేయాలంటరా?
  • ఉత్తరప్రదేశ్​ సర్కారుపై సుప్రీంకోర్టు సీరియస్

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌‌లోని ఇండస్ట్రీలను బ్యాన్ చేయాలని మీరు అనుకుంటున్నారా అంటూ యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ పడిపోవడానికి.. పాక్‌‌ నుంచి వచ్చే కలుషితమైన గాలి కారణమని చెప్పడంపై సీరియస్ అయింది. యూపీ సర్కారు తరఫున విచారణకు హాజరైన సీనియర్ అడ్వకేట్ రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘‘ఢిల్లీ కాలుష్యానికి.. యూపీలోని ఇండస్ట్రీలకు ఎలాంటి సంబంధంలేదు. ఆ ఇండస్ట్రీల నుంచి వెలువడే కలుషిత గాలి ఢిల్లీ వైపు వెళ్లదు” అని చెప్పారు. దీంతో ఘాటుగా స్పందించిన సీజేఐ జ‌‌స్టిస్‌‌ రమణ.. అయితే పాకిస్తాన్‌‌లో పరిశ్రమలపై నిషేధం విధించాలా? అని ప్రశ్నించారు. ఢిల్లీ, ఎన్‌‌సీఆర్ రీజియన్‌‌లో గాలి కాలుష్యంపై దాఖలైన పిటిషన్లను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌‌తో కూడిన స్పెషల్ బెంచ్ విచారిస్తోంది.

40 స్క్వాడ్స్‌‌ ఏర్పాటు
ఎయిర్‌‌‌‌ క్వాలిటీ మేనేజ్‌‌మెంట్‌‌పై ఏర్పాటైన కమిటీ ఆర్డర్లను అమలు చేయాలని కేంద్రం, నేషనల్ క్యాపిటల్ రీజియన్‌‌లోని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం ఎదుట కమిటీ అఫిడవిట్ దాఖలు చేసింది. ‘‘ఢిల్లీ, ఎన్‌‌సీఆర్‌‌‌‌లో పొల్యూషన్‌‌ను కంట్రోల్ చేసేందుకు ఐదుగురు సభ్యుల ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ టాస్క్‌‌ఫోర్స్‌‌ను ఏర్పాటు చేశాం. కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి టాస్క్‌‌ఫోర్స్ సూచించిన చర్యల అమలును 40 స్క్వాడ్స్‌‌ పర్యవేక్షిస్తాయి” అని అందులో వివరించింది. 

కోర్టును విలన్ చేస్తున్నరు
విచారణ ప్రారంభం సందర్భంగా కొన్ని వార్తలను కోర్టు ప్రస్తావించింది. ‘‘స్కూళ్ల విషయంలో ఉద్దేశపూర్వకంగానో, అనుకోకుండానో కొన్ని సెక్షన్ల మీడియా.. మమ్మల్ని విలన్లలా చిత్రీకరిస్తోంది. మీరేమో స్కూళ్లు ఓపెన్ చేసేశారు. కానీ న్యూస్‌‌ పేపర్లలో చూడండి..” అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీ సర్కారు తరఫున వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వీ.. ఢిల్లీ ప్రభుత్వ పరిపాలనను టేక్ ఓవర్ చేస్తామని సుప్రీం చెప్పినట్లుగా ఓ ఇంగ్లిష్ పత్రిక రాసుకొచ్చిందని చెప్పారు. ‘‘ఎన్ని కథనాలు వచ్చినా మీరు(ఢిల్లీ ప్రభుత్వం) వాటిని ఖండిస్తారు. మేం ఎక్కడికి పోవాలి? అడ్మినిస్ట్రేటివ్‌‌ పాత్ర చేపడుతామని మేం ఎక్కడ చెప్పాం? ఓ పొలిటికల్ పార్టీ ప్రెస్‌‌మీట్ పెట్టి మాట్లాడగలదు. కానీ మేం అలా చేయలేం కదా!!” అని బెంచ్ కామెంట్ చేసింది.