వార్సా (పోలాండ్): ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ సన్నాహాల్లో భాగంగా యువ గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్ తన జోరును ప్రదర్శిస్తున్నాడు. గ్రాండ్ చెస్ టూర్ ' సూపర్ రాపిడ్ అండ్ బ్లిట్జ్' టోర్నీలో ఐదో రౌండ్‌లో తన టైటిల్ ప్రత్యర్థి జవోఖిర్ సిందరోవ్‌ను చిత్తు చేసిన గుకేశ్, ఆరో రౌండ్‌లో అమెరికా దిగ్గజం వెస్లీ సోను డ్రాగా అడ్డుకున్నాడు. నల్లపావులతో ఆడిన గుకేశ్.. ' కారో-కాన్ డిఫెన్స్' ఎంచుకుని ప్రత్యర్థిని ఇరకాటంలో పెట్టాడు.
ఆరంభంలో ఒక పావును గెలుచుకుని, ఆ తర్వాత సిందరోవ్ చేసిన తప్పిదాలను సొమ్ము చేసుకున్నాడు. ఒత్తిడికి లోనైన ఉజ్బెకిస్తాన్ క్రీడాకారుడు తన రాణిని త్యాగం చేసినా ఫలితం లేకపోయింది. చివరకు 52 ఎత్తుల్లో గుకేశ్ విజయాన్ని అందుకున్నాడు. రాపిడ్ విభాగంలో విజయానికి రెండు పాయింట్లు, డ్రాకు ఒక పాయింట్ లభిస్తాయి. ఆరో రౌండ్‌లో వెస్లీ సోతో జరిగిన మ్యాచ్‌ను గుకేశ్ త్వరగానే డ్రాగా ముగించాడు. అమెరికా ఆటగాళ్లు వెస్లీ సో, హన్స్ నీమన్ చెరో 9 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. వ్లాదిమిర్ ఫెడోసీవ్ 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. గుకేశ్‌తో పాటు ఫాబియానో కరువానా, జాన్ డుడా, మాక్సిమ్ వాచియర్ లాగ్రావ్ 6 పాయింట్లతో సమంగా ఉన్నారు.
