సీనియర్లకు సాధ్యం కాలె.. జూనియర్లకు సాధ్యమైంది..

సీనియర్లకు సాధ్యం కాలె.. జూనియర్లకు సాధ్యమైంది..

పాన్ ఇండియా.. గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ఇది. రీజినల్ సినిమాను నేషన్ వైడ్ ఆడియెన్స్కు పరిచయం చేసింది. దక్షిణాది కుర్ర హీరోలకు దేశవ్యాప్తంగా అభిమానుల్ని తెచ్చిపెడుతోంది. టాలీవుడ్ సీనియర్ కథానాయకుల కన్నా ఇప్పటి హీరోల క్రేజ్ ఎక్కువ. వాస్తవానికి దక్షిణాదిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, కమల్ హాసన్, రజనీకాంత్ తదితర హీరోలకున్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయినా వారు పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ కాలేకపోయారు. పరభాషా చిత్రాల్లో నటించినా ఆయా ఇండస్ట్రీల్లో ఊహించిన రీతిలో స్టార్ డమ్ సంపాదించుకోలేకపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రభాస్, అల్లు అర్జున్ మొదలు విజయ్ దేవరకొండ వరకు పాన్ ఇండియా మూవీలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంటున్నారు.

రాజమౌళి న్యూ ట్రెండ్..

పాన్ ఇండియా మూవీ బాహుబలితో టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కొత్త ఒరవడికి నాంది పలికాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేసి రికార్డులు సృష్టించాడు. బాహుబలి అనంతరం చాలా మంది యంగ్ హీరోలు పాన్ ఇండియా సినిమాల వైపు మొగ్గుచూపుతున్నారు. సాహో, సైరా, కేజీఎఫ్, రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్,పుష్ప తదితర సినిమాలు పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించినా వాటిలో కొన్ని మాత్రమే సక్సె్స్ అయ్యాయి. 

సీనియర్లకు సాధ్యం కాలేదు..

వాస్తవానికి ఈ పాన్ ఇండియా ప్రయోగాన్ని టాలీవుడ్ సీనియర్ హీరోలు  చేసినా సక్సెస్ కాలేకపోయారు. మెగాస్టార్ చిరంజీవి 1990లో ప్రతిబంధ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో రాజశేఖర్ నటించిన అంకుశం సినిమాకు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి సరసన జూహీచావ్లా హీరోయిన్గా నటించింది. రవిరాజా పినిశెట్టి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ హిందీలో హిట్ అయింది. దీంతో చిరంజీవి పేరు ఆలిండియా రేంజ్ లో మార్మోగిపోయింది. ఆ తర్వాత 1992లో గ్యాంగ్ లీడర్ మూవీని హిందీలో ఆజ్ కా గూండా రాజ్ పేరుతో రీమేక్ చేశారు. అది కూడా హిట్టైనా తర్వాత ఆ ఒరవడి కొనసాగించలేకపోయారు. 

విక్టరీ వెంకటేశ్ చంటి సినిమాను 1993లో హిందీలో అనాడీ పేరుతో రీమేక్ చేశారు. రామానాయుడు నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన కరిష్మా కపూర్ అలరించింది. ఈ మూవీ మంచి హిట్టైంది. అదే జోష్ లో తెలుగులో అలీ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ యమలీలను వెంకటేశ్ కథానాయకుడిగా తక్ దీర్ వాలా పేరుతో హిందీలో రీమేక్ చేశారు. కానీ ఆ మూవీ అట్టర్ ఫ్లాపవడంతో.. వెంకీ ఇక హిందీ సినిమాల జోలికి పోలేదు. 

నాగార్జున హిందీలో చేసిన ఫస్ట్ మూవీ శివ. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన శివ కు ఇది రీమేక్. హిందీలో కూడా రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినా నాగార్జునకు పెద్ద సక్సెస్ రాలేదు. 1992 నుంచి 2003 వరకు ఖుదాగవా, ద్రోహి, క్రిమినల్, జక్మ్, అగ్నివర్ష, ఎల్ఓసీ కార్గిల్ సినిమాల్లో నటించినా బాలీవుడ్ స్టార్లకు పోటీ ఇవ్వలేకపోయాడు. 

కమల్ హాసన్ ,రజనీకాంత్ టాలీవుడ్ హీరోల కన్నా ఎక్కువ హిందీ సినిమాల్లో నటించారు. అయినా పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ సాధించలేకపోయారు. కమల్ హసన్, పుష్పక్, ఏక్ దూజే కేలియే, సద్మా, సాగర్, అగ్నికాల్, యాద్గార్, యే దేశ్, జరాసీ జిందగీ, హే రామ్ తదితర చిత్రాల్లో నటించి బాలీవుడ్ హీరోలకు గట్టిపోటీ ఇచ్చారు. మరోవైపు రజినీ కాంత్ కూడా హమ్, ఆతంక్ హీ ఆతంక్, జీత్ హమారి, జుల్మ్ కీ జంజీర్, ఇన్సాఫ్ కౌన్ కరేగా, మర్ద్ సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ పాన్ ఇండియా రేంజ్ లో మాత్రం ఆకట్టుకోలేకపోయారు. కానీ ఇప్పటి యంగ్ హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్, యశ్, విజయ్ దేవరకొండ తదితరులు బాలీవుడ్తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంటున్నారు. 

చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలు హిందీ సినిమాలు చేసే సమయంలో ఈ పాన్ ఇండియా స్టామినా,  క్రేజ్ లేదు. వాళ్లు హిందీ సినిమా చేస్తేనే నేషనల్ లెవెల్ కు వెళ్లగలుగుతాం అని అనుకునే వారు. అందుకే 1990ల్లో వరుసగా హిందీ సినిమాలు చేశారు. తెలుగు సినిమా ద్వారానే నేషనల్ లెవెల్కు వెళ్లొచ్చు అనే కాన్సెప్ట్ అప్పట్లో డెవలప్ కాలేదు. వాళ్లు  హిందీ సినిమాలు చేసినప్పుడు అందరికీ హిట్స్ ఉన్నాయి. అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. కానీ బాలీవుడ్ ,టాలీవుడ్ రెండింటినీ మేనేజ్ చేయలేకపోయారు. దీంతో సినీయర్ హీరల పరిస్థితి రెండు పడవల మీద ప్రయాణంలా మారింది. కెరీర్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే పెద్దగా కంటిన్యూ అవ్వలేకపోయారంటున్నారు సినీ విశ్లేషులు. 

రీజినల్ సినిమా కథను నేషన్ వైడ్గా చెప్పి ప్రజల మెప్పు పొందడమే పాన్ ఇండియా పాలసీ. అందుకే  కేజీఎఫ్, పుష్ప పెద్ద హిట్టయ్యాయి. కానీ సీనియర్ హీరోలు మాత్రం బాలీవుడ్ టార్గెట్గా సినిమాలు చేశారు. అందుకే అక్కడి ఆడియెన్స్ కు పెద్దగా రిజిస్టర్ కాలేకపోయారు. జితేంద్ర, అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి తదితర హీరోలు అప్పటికే బాలీవుడ్ ను ఏలుతుండటంతో మన హీరోలు పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. 

సీనియర్లు సక్సెస్ కాకపోవడానికి..

చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ అక్కడ సక్సెస్ కాకపోవడానికి రీజన్ ఏంటంటే.. వాళ్లు టాలీవుడ్ను వదలకపోవడం. అక్కడ, ఇక్కడ మేనేజ్ చేయలేక చతికిలపడ్డారు. సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్, నార్త్ ఇండియన్ ఫిలిం మేకింగ్ కు చాలా తేడా ఉంది. అక్కడి మార్కెట్, ఇక్కడి మార్కెట్ వేరు. టాలీవుడ్లో టాప్ స్టార్లుగా పిలవబడే వీళ్లు బాలీవుడ్కు  వెళ్లాక కొత్తవాళ్లుగానే పరిగణింపబడేవాళ్లు. దాన్ని ఓవర్ కమ్ చేయలేకపోయారు. నాకు తెలిసి ఇప్పుడున్న స్టార్లు కూడా అక్కడ ఎంతమేరకు నిలదొక్కుకుంటారనేది డౌటే. రాజమౌళి బాహుబలి వల్ల ప్రభాస్కు పేరొచ్చింది కానీ ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్లతో ఆయన మార్కెట్ డౌన్ అయింది. అల్లు అర్జున్, యశ్, విజయ్ దేవరకొండలకు కూడా పాన్ ఇండియా ఇమేజ్ ఒక సవాలే. వీరు ఎంత వరకు దాన్ని కంటిన్యూ చేస్తారో చూడాలి. 


నిజానికి అప్పటి హీరోలకు, ఇప్పటి హీరోలకు ఉన్న తేడాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మార్కెటింగ్. ఇప్పటి స్టార్లు తొందరగా సక్సెస్ కావడానికి రీజన్ డిజిటల్ మీడియా. ఇప్పుడున్న సోషల్ మీడియా, ఓటీటీలు, యూట్యూబ్.. వారి సక్సెస్లో కీ రోల్ ప్లే చేస్తున్నాయి.  అందుకే రీజనల్ సినిమా అందరికీ చేరువైంది. ఫలితంగా సౌత్ స్టార్లను నార్త్ ఆడియన్స్ తొందరగా ఓన్ చేసుకుంటున్నారు. అందుకే రవితేజ, అడవి శేష్, నిఖిల్, రామ్, సందీప్ కిషన్ లాంటి మీడియం రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియా క్రేజ్ కోసం తహతహలాడుతున్నారు.  కానీ సీనియర్ హీరోల సమయంలో సోషల్ మీడియా లేదు. పబ్లిసిటీ కూడా తక్కువే. తెలుగు సినిమా జనాలకు చేరాలంటేనే కష్టంగా ఉండేది. అందుకే వారు పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ సాధించలేకపోయారు.