నేడు న్యూజిలాండ్‌‌తో ఇండియా తొలి టీ20

నేడు న్యూజిలాండ్‌‌తో ఇండియా తొలి టీ20
  • హార్దిక్‌‌ పాండ్యా కెప్టెన్సీపై దృష్టి
  • మ్యాచ్​కు వర్షం ముప్పు
  • మ. 12 నుంచి స్టార్‌‌ స్పోర్ట్స్‌‌లో 

వెల్లింగ్టన్‌‌: ఓవైపు సీనియర్లకు విశ్రాంతి.. మరోవైపు కఠినమైన వాతావరణ పరిస్థితులు.. ఈ నేపథ్యంలో యంగ్‌‌ ఇండియా.. న్యూజిలాండ్‌‌తో మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్‌‌కు రెడీ అయ్యింది. టీ20 వరల్డ్‌‌కప్‌‌ వైఫల్యాన్ని మర్చిపోయి తాజాగా ఈ సిరీస్‌‌ను మొదలుపెట్టాలని  భావిస్తోంది. దీంతో శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌‌లో  గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. గతేడాది యూఏఈలో వరల్డ్‌‌కప్‌‌లో ఓడిన తర్వాత టీమిండియా బ్యాటింగ్‌‌ అప్రోచ్‌‌ పూర్తిగా మారిపోయింది. దూకుడైన బ్యాటింగ్‌‌తో వరుసగా సిరీస్‌‌లు నెగ్గినా.. ఆసీస్‌‌ గడ్డపై జరిగిన మెగా టోర్నీలో చతికిలపడింది. దీంతో రెండేళ్ల తర్వాత జరగబోయే టీ20 వరల్డ్‌‌కప్‌‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పట్నించే అటాకింగ్‌‌ గేమ్‌‌ ఆడే మెరికల్లాంటి కుర్రాళ్లను తయారు చేయాలని టీమిండియా మేనేజ్‌‌మెంట్‌‌ భావిస్తోంది. అయితే టీమ్‌‌లో చాలా మంది యంగ్‌‌స్టర్స్‌‌ ఉండటంతో ఏ ప్లేస్‌‌కు ఎవరు సరిపోతారనే అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక న్యూజిలాండ్‌‌ కూడా ఈ సిరీస్‌‌ను గెలిచి మెగా ఈవెంట్‌‌ ఓటమిని మర్చిపోవాలని భావిస్తోంది. 

ఓపెనర్లు ఎవరు?

రోహిత్‌‌ శర్మ గైర్హాజరీతో టీమ్‌‌ను నడిపించనున్న హార్దిక్‌‌ పాండ్యాను షార్ట్‌‌ ఫార్మాట్‌‌కు పర్మినెంట్‌‌ లీడర్‌‌ను చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. దీంతో ఈ సిరీస్‌‌ అతనికి కత్తిమీద సాముగా మారింది. ఆల్‌‌రౌండర్‌‌గా తన పాత్రకు న్యాయం చేస్తూనే టీమ్‌‌ను నడిపించాల్సిన అతిపెద్ద బాధ్యత అతనిపై ఉంది. ఇక మిగతా టీమ్‌‌ విషయానికొస్తే ప్రస్తుతం ఓపెనింగ్‌‌ స్లాట్‌‌కు విపరీతమైన పోటీ నెలకొంది. కేఎల్‌‌ రాహుల్‌‌ లేకపోవడంతో.. ఇషాన్‌‌ కిషన్‌‌, శుభ్‌‌మన్‌‌ గిల్‌‌  ఓపెనర్లుగా వచ్చే చాన్స్‌‌ ఉంది. ఇప్పటికే టెస్ట్‌‌ల్లో నిరూపించుకున్న గిల్‌‌.. షార్ట్‌‌ ఫార్మాట్‌‌లోనూ తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నాడు. అయితే రిషబ్‌‌ పంత్‌‌ను మరోసారి ఓపెనర్‌‌గా పంపించాలన్న వాదన కూడా మొదలైంది. ఇదే జరిగితే గిల్‌‌ మిడిలార్డర్‌‌కు మారొచ్చు. అప్పుడు సూర్యకుమార్‌‌కు తోడుగా సంజూ శాంసన్‌‌, దీపక్‌‌ హుడాలో ఒకరే తుది జట్టులో ఉంటారు. ఫినిషర్‌‌గా పాండ్యా పాత్ర అత్యంత కీలకంకానుంది. పేసర్లుగా భువనేశ్వర్‌‌, అర్ష్‌‌దీప్‌‌, హర్షల్‌‌ పటేల్‌‌కు చాన్స్‌‌ దక్కొచ్చు. అయితే యార్కర్‌‌ స్పెషలిస్ట్‌‌ ఉమ్రాన్‌‌ మాలిక్‌‌ను పక్కనబెట్టే సాహసం చేస్తారా? చూడాలి. స్పిన్నర్లుగా చహల్‌‌ తుది జట్టులో ఉండొచ్చు. వరల్డ్‌‌కప్‌‌కు దూరంగా ఉన్న చహల్‌‌ ఈ సిరీస్‌‌తో మరోసారి సత్తా చాటాలని యోచిస్తున్నాడు. గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్‌‌ సుందర్‌‌పై కూడా మేనేజ్‌‌మెంట్‌‌ నమ్మకం పెట్టొచ్చు. ప్రస్తుతానికైతే కుల్దీప్‌‌కు చాన్స్‌‌ లేనట్లుగానే కనిపిస్తోంది. 

ఆల్‌‌రౌండర్ల బలం..

వరల్డ్‌‌కప్‌‌ నాకౌట్‌‌ మ్యాచ్‌‌ నుంచి వైదొలిగిన న్యూజిలాండ్‌‌కు ఆల్‌‌రౌండర్ల బలం ఎక్కువగా ఉంది. దీంతో పాటు సొంతగడ్డపై కివీస్‌‌ మరింత ప్రమాదకరంగా ఆడుతుంది. విలియమ్సన్‌‌, అలెన్‌‌ ఇచ్చే ఓపెనింగ్‌‌పై భారీ స్కోరు ఆధారపడి ఉంది. కాన్వే, ఫిలిప్స్‌‌ చెలరేగితే ఇండియన్‌‌ బౌలర్లకు కష్టాలు తప్పవు. మిడిల్‌‌లో మిచెల్, నీషమ్‌‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌‌ ఆశించొచ్చు. అయితే సెంట్రల్‌‌ కాంట్రాక్ట్‌‌లో లేని ట్రెంట్‌‌ బౌల్ట్‌‌ ఈ సిరీస్‌‌లో ఆడకపోవడం కివీస్‌‌కు ప్రతికూలాంశం. ఇది ఇండియాకు లాభించే అంశమే అయినా సౌథీ, మిల్నే, ఫెర్గుసన్‌‌, నీషమ్‌‌తో కూడి పేస్‌‌ బలగం గొప్పగా ఉంది. స్పిన్నర్‌‌గా ఇష్‌‌ సోధీ ప్రభావం చూపొచ్చు. 

జట్లు (అంచనా)
ఇండియా: హార్దిక్‌‌ (కెప్టెన్‌‌), ఇషాన్‌‌, గిల్‌‌, శ్రేయస్‌‌ / శాంసన్‌‌ / దీపక్‌‌ హుడా, సూర్యకుమార్‌‌, పంత్‌‌, సుందర్‌‌, హర్షల్‌‌ / ఉమ్రాన్‌‌ మాలిక్‌‌, భువనేశ్వర్‌‌, అర్ష్‌‌దీప్‌‌, చహల్‌‌. 
న్యూజిలాండ్‌‌: విలియమ్సన్‌‌ (కెప్టెన్‌‌), అలెన్‌‌, కాన్వే, ఫిలిప్స్‌‌, మిచెల్‌‌, నీషమ్‌‌, శాంట్నెర్‌‌, సౌథీ, ఇష్‌‌ సోధీ, మిల్నే, ఫెర్గుసన్‌‌.