
దుబ్బాక, వెలుగు : ఆన్‌లైన్ బెట్టింగ్, ట్రేడింగ్‌లో డబ్బులు పోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన పయ్యావుల దయాకర్(20) సొంతంగా షాపు నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఆరు సంవత్సరాలుగా ఆన్‌లైన్ బెట్టింగ్, ట్రేడింగ్ చేస్తూ డబ్బులు పోగొట్టుకున్నాడు.
మృతుడి తండ్రి ఏడాది కింద చనిపోగా.. తల్లి అనారోగ్యానికి గురి కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మనస్తాపానికి గురైన దయాకర్ మంగళవారం ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత స్థానికులు గమనించి దుబ్బాక ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.