
రోడ్లపై రయ్యి రయ్యిమంటూ వాహనాలు నడుపుతూ యువకులు ఫీట్లు చేస్తుంటారు. అత్యంత ప్రమాదకరంగా ఫీట్లు చేస్తూ.. ఇతర వాహదారులను భయబ్రాంతులకు గురి చేస్తుంటారు. ఇవి ఎక్కువగా నగరంలో కనబడుతుంటాయి. వీరిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. అక్కడక్కడ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ ఫీట్లు ఇప్పుడు గ్రామాలకు పాకింది. ఓ యువకుడు ఆటోపైకి ఎక్కి.. నిలబడి ప్రయాణం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిని చూసిన ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన నారాయణఖేడ్ పట్టణంలో చోటు చేసుకుంది.
నారాయణఖేడ్ పట్టణంలో మంగళవారం ఏపీ 23 టిఎ 1504 నెంబర్ గల ఆటోపై మడిగె సాయిలు అనే యువకుడు ఆటోపై నిల్చుని ప్రయాణం చేశాడు. దీనిని పట్టణ వాసులు చూసి నోరెళ్లబెట్టారు. ఆటోలో కూర్చొని వెళ్లక.. ఇదేం ఫీటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు ఆటోను ఆపి డేంజరస్ డ్రైవింగ్ చేయడంతో పాటు రూల్స్ పాటించనందుకు రూ. 1600 ఫైన్ చేశారు. దీనిపై ఎస్ఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. యూత్ ఇలాంటి ఫీట్లు చేయకూడదని హెచ్చరించారు.