
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలతో తమ అభ్యర్థులను బరిలోకి దించేందుకు కసరత్తులు చేస్తున్నాయి. ప్రజల్లో పేరున్న వ్యక్తులను పోటీలో నిలిపేందుకు అభ్యర్థుల వేటలో ఉన్నాయి. ఇదిలా ఓ కాంగ్రెస్ యూత్ లీడర్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.
సర్పంచ్, జెడ్పీటీసీ,ఎంపీటీసీ గా పోటీ అభ్యర్థులకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టపల్లి వెంకటేష్ బంపరాఫర్ ఇచ్చారు. తెలంగాణ లో సర్పంచ్ MPTC ZPTC పోటీ చేసే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు సాయం చేస్తానని ప్రకటించారు. ఈ సందర్బంగా తెలంగాణ యూత్ కాంగ్రెస్ లీడర్లకు లేఖ రాశారు.
మరోవైపు జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావటం.. మొదటి విడత నామినేషన్ల దాఖలు ప్రారంభం అయిన క్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు రివ్యూ మీటింగ్ పెట్టారు. జిల్లా అధ్యక్షులు, కీలక నేతలు, కార్యకర్తలతో జూం మీటింగ్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.
స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేయాలని.. అన్ని జిల్లాల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా వ్యూహాలు ఉండాలని.. కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికీ వివరించాలన్నారాయన. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం.. రైతుల అప్పులు మాఫీ, ఉచిత బస్సు వంటి అనేక సంక్షేమ పథకాలను అందజేస్తున్నామన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు అనేది చాలా ముఖ్యం అని.. క్లీన్ స్వీప్ చేసే దిశగా అభ్యర్థుల ఎంపిక ఉండాలని సూచించారాయన.