గురువారం ( జనవరి 22 ) మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఏపీలో సంక్రాంతి సందర్భంగా రూ. 2 వేల కోట్లు చేతులు మారాయని.. ప్రభుత్వమే పందాలను ప్రోత్సహించిందని అన్నారు జగన్. ఎమ్మెల్యేలే పందాలు ఎలా నిర్వహిస్తారని.. గ్యాంబ్లింగ్ కు చట్టబద్దత కల్పించరా అని ప్రశ్నించారు. పోలీసులు, నాయకులు వాటాలు పంచుకున్నారని.. ప్రభుత్వమే ఈ పందాలను ప్రోత్సహించిందని అన్నారు జగన్.
చంద్రబాబు అనుచరుల లబ్ధికోసమే అమరావతి నిర్మాణాలు చేపట్టారని అన్నారు. తమ హయాంలో రూ.38 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. చంద్రబాబు హయాంలో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని అన్నారు జగన్. ఏపీకి వచ్చిన పెట్టుబడుల్లో ఎన్ని గ్రౌండ్ అయ్యాయో చెప్పాలని అన్నారు. సర్వే రాళ్లు లేకుండానే చంద్రబాబు రీసర్వే చేయిస్తున్నాడని అన్నారు జగన్. ఏ రాయి పడితే.. ఆ రాయి పెట్టి సర్వే అంటున్నారని ఎద్దేవా చేశారు.
పాస్ బుక్కుల విషయంలో తమ హయాంలో చేసిందే చంద్రబాబు చేస్తున్నారని.. కేవలం రంగు మాత్రమే మార్చి ఇస్తున్నారని అన్నారు జగన్. కమీషన్లు తీసుకొని పాస్ బుక్కులు ఇస్తున్నారని మండిపడ్డారు జగన్. తమ హయాంలో పాతిన సర్వే రాళ్లపై ఉన్న పేర్లను తొలగిస్తున్నారని.. అందుకోసం రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు జగన్.
