ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కడప జిల్లా బద్వేలు నుండి బస్సు యాత్రను ఇవాళ ప్రారంభించారు షర్మిల. ఈ క్రమంలో వైసీపీపై ఘాటైన విమర్శలు చేశారు. వైసీపీ డీఎన్ఏ లోనే శవరాజకీయాలు ఉన్నాయని, అప్పట్లో తండ్రి మరణాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకున్నారని, ఇప్పుడు చిన్నాన్నను చంపేసి సానుభూతి పొందారని అన్నారు. చిన్నాన్నను చంపిన వారికి జగన్ ఎంపీ టికెట్ ఇవ్వటంతో తట్టుకోలేకపోయానని అన్నారు.
హంతకులు చట్టసభల్లో ఉండకూడదని, తనను ఎంపీగా చూడాలన్నది వివేకా చివరి కోరిక అని, అందుకే కడప ఎంపీగా బరిలో దిగినట్లు తెలిపారు. కుటుంబంలో చీలిక రావటం బాధాకరమైనప్పటికీ పోటీ చేయక తప్పట్లేదని అన్నారు. వివేకాను చంపిందెవరో కడప ప్రజలకు తెలుసని అన్నారు. కాగా, కడప పార్లమెంట్ బరిలో వైసీపీ నుండి సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, టీడీపీ నుండి భూపేష్ రెడ్డి బరిలో ఉండగా షర్మిల ఎంట్రీతో హోరాహోరీగా త్రిముఖ పోరు మొదలైంది. మరి, కడప పార్లమెంట్ స్థానానికి మునుపెన్నడూ లేని విధంగా పోటీ నెలకొన్న నేపథ్యంలో ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారో వేచి చూడాలి.