3100 కిలోమీటర్ల మైలురాయి దాటిన వైఎస్ షర్మిల పాదయాత్ర 

 3100 కిలోమీటర్ల మైలురాయి దాటిన వైఎస్ షర్మిల పాదయాత్ర 

మంచిర్యాల జిల్లా : కాళేశ్వరం ప్రాజెక్టుతో వ్యవసాయానికి చుక్క నీరు ఇవ్వలేదు గానీ వేల ఎకరాలను నీట ముంచారని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. జైపూర్ మండలంలో వేల ఎకరాలు నీట మునిగితే  బాధిత రైతులకు నష్ట పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రజలు తాగేందుకు నీరు లేదు గానీ, ఇక్కడ ఉన్న నీళ్లను మాత్రం కేసీఅర్ ఫామ్ హౌజ్ కు పట్టుకుపోతున్నారని ఆరోపించారు. రైతుల భూములను రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా లాక్కుంటోందని ఆరోపించారు. 

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్ పై మరోసారి వైఎష్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో బాల్క సుమన్ చేసిన అభివృద్ధి పనులేమీ లేవన్నారు. నియోజకవర్గంలో శిలాఫలకాలు తప్పా అభివృద్ధి శూన్యం అన్నారు. ‘బానిస సుమన్.. శిలాఫలకాల సుమన్’ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో సింగరేణి సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ షర్మిల చేపట్టిన ‘ప్రజా ప్రస్థానం పాదయాత్ర’ 3100 కిలోమీటర్ల మైలురాయి దాటింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి గ్రామం వద్ద వైఎస్ఆర్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు.