కేసీఆర్ సర్కారు పేదలను పట్టించుకోవడం లేదు

 కేసీఆర్ సర్కారు పేదలను పట్టించుకోవడం లేదు

రాష్ట్రంలోని పేదలను కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రేషన్ షాపుల్లో బియ్యంతో సహా 7 రకాల వస్తువులు అందించేవారని చెప్పారు. ఇప్పుడు కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. 8 ఏళ్ల పాలనలో కేసీఆర్... ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. వైఎస్ షర్మిల ఇవాళ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో 128వ రోజు ప్రజాప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. నర్వ మండల కేంద్రంలో ఆమెకు వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకురావడానికే తాను పార్టీ పెట్టానని షర్మిల తెలిపారు.

దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని.. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వలేదని షర్మిల వ్యాఖ్యానించారు. రైతులకు రుణమాఫీ ఇవ్వని కేసీఆర్.. దళిత ద్రోహి, మైనార్టీ ద్రోహి, రైతు ద్రోహి అని షర్మిల ఫైర్ అయ్యారు. కేసీఆర్ పాలన ఎంత దరిద్రంగా ఉందో స్వయంగా ప్రజలే చెప్తున్నారని తెలిపారు. అరచేతిలో వైకుంఠం చూపే పాలన కేసీఆర్ ది అని విమర్శించారు. ప్రజలను గాలికొదిలి, ఫామ్ హౌజ్​కే పరిమితమై, బంగారు తెలంగాణ చేశానని బోగాలు అనుభవిస్తున్నాడని ఆరోపించారు. ఎనిమిదేండ్ల పాలనలో కేసీఆర్ ఏనాడైనా ప్రజలతో మాట్లాడారా? సమస్యలు తెలుసుకున్నారా? అని షర్మిల ప్రశ్నించారు.