రాజీనామాలు ఏమయ్యాయ్.. జగన్ పై విమర్శలు గుప్పించిన షర్మిల..

రాజీనామాలు ఏమయ్యాయ్.. జగన్ పై విమర్శలు గుప్పించిన షర్మిల..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు.  కేంద్రంలోని బీజేపీకి వైసీపీ ప్రభుత్వం తొత్తుగా మారిందని విమర్శించారు. అధికారంలోకి రాక ముందు ప్రత్యేక హోదా కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన జగన్ అధికారంలో రాగానే ఆ విషయమే మరిచిపోయారని షర్మిల విమర్శించారు. ఏలూరులోని దెందులూరులో బహిరంగ  సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామా చేస్తానన్న జగన్ ఏమైందంటూ ప్రశ్నించారు. వైసీపీ, టీడీపీ పార్టీలు ఏనాడు రాష్ట్ర విభజన హమీలపై కొట్లాడలేదని ఆరోపించారు.

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని అధికార పక్షం, ప్రతిపక్షం బీజేబీతో పొత్తు కోసం పాకులాడుతోందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనులు ఎక్కడ వేసి గొంగడి అక్కడే అన్న చందంగా మారాయని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రభుత్వం మెగా డీఎస్సీని తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలంతా నిజాలను గ్రహించి సరైన పార్టీకి అలోచించి ఓటు వేయాలని వైఎస్ పిలుపునిచ్చారు.