ప్రధాని మోడీకి వైఎస్​ షర్మిల బహిరంగ లేఖ

ప్రధాని మోడీకి వైఎస్​ షర్మిల బహిరంగ లేఖ
  • ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ  
  • అక్కరకు రాని ప్రాజెక్టుకు మళ్లీ మూడో టీఎంసీ ఎందుకు?
  • మోడీ వస్తే కేసీఆర్ పిల్లిలా దాక్కుంటున్నారని విమర్శ

పెద్దపల్లి/గోదావరిఖని/రామగిరి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్​ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని వైఎస్సార్​టీపీ చీఫ్​ షర్మిల డిమాండ్​ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆమె బహిరంగ లేఖ రాశారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, కమాన్​పూర్, రామగిరి మండలాల్లో షర్మిల శుక్రవారం పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని మోడీని కోరుతూ పోస్టర్​ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. గోదావరి నదిపై కాళేశ్వరం అనే సినిమా ఫ్లాప్ అయిందని, కట్టిన మూడేండ్లలోనే మునిగిపోయిన ప్రాజెక్ట్ ప్రపంచంలో ఇది ఒక్కటేనని విమర్శించారు. ‘‘కాళేశ్వరానికి రూ.97,500 కోట్లు సెంట్రల్ ఫైనాన్స్ సంస్థలు అప్పుగా ఇచ్చాయి. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. కాళేశ్వరాన్ని కేసీఆర్ ఏటీఎంలా వాడుకుంటున్నారని బీజేపీ నేతలే చాలాసార్లు చెప్పారు. అయినా కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు” అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు అద్భుతమని కేసీఆర్ ప్రజలను మోసగిస్తున్నారని,  నిజానికి ఇది దేశంలోనే జరిగిన అతి పెద్ద కుంభకోణమని ఆరోపించారు. 18 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇస్తామని చెప్పి, 50 వేల ఎకరాలకు కూడా ఇవ్వలేకపోయారన్నారు. 

అక్కరకు రాని ప్రాజెక్టుకు మూడో టీఎంసీ ఎందుకు? 

రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసేందుకు అనుమతి ఉందని, కానీ మూడేండ్లలో 50 టీఎంసీలు కూడా ఎత్తిపోయలేదని షర్మిల అన్నారు. అక్కరకు రాని ప్రాజెక్టుకు మూడో టీఎంసీ ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ కు డబ్బు అవసరం కాబట్టి మూడో టీఎంసీ ప్రతిపాదన తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను మేఘా కృష్ణారెడ్డికే ఎందుకు అప్పగిస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాని రాష్ట్రానికి వస్తే సీఎం వెళ్లి సమస్యల గురించి అడగాలిగానీ కేసీఆర్ మాత్రం పిల్లిలా దాక్కుంటున్నారని విమర్శించారు. మోడీని కలిస్తే అవినీతిపై ప్రశ్నిస్తారేమోనని భయపడి తప్పించుకుతిరుగుతున్నారని అన్నారు.