2వేల కిలోమీటర్ల మైలురాయికి చేరిన షర్మిల పాదయాత్ర

2వేల కిలోమీటర్ల మైలురాయికి చేరిన షర్మిల పాదయాత్ర
  • కొత్తకోట వద్ద పైలాన్ ఆవిష్కరించిన షర్మిల

కొత్తకోట: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఇవాళ 2వేల కిలోమీటర్ల మైలు రాయి చేరుకుంది. ఉమ్మడి మహమూబ్ నగర్ జిల్లా కొత్తకోట వద్ద 2వేల కిలోమీటర్ల మైలు రాయిని చేరుకున్న సందర్భంగా తన తల్లి.. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో కలసి పైలాన్ ను షర్మిల ఆవిష్కరించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో గత ఏడాది అక్టోబర్ 20వ తేదీన చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన షర్మిల కేవలం 148 రోజుల్లోనే 2వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు..  నల్గొండ జిల్లాలో పూర్తి చేసుకుని ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పాలమూరు జిల్లాలో 11 నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తయింది. 
ఎండనక.. వాననక షర్మిల కొనసాగిస్తున్న పాదయాత్ర 2వేల కిలోమీటర్లకు చేరుకున్న కీలక ఘట్టానికి వైఎస్ విజయమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పైలాన్ ఆవిష్కరణలో పాల్గొన్న వైఎస్ విజయమ్మ  కొత్తకోట కూడలిలో షర్మిల ప్రసంగం సమయంలోనూ షర్మిల పక్కనే ఉండి ప్రజలకు అభివాదం చేశారు.